మంత్రి సాకుతో కోర్టుకు ఎగనామం.. దళపతి ప్రభుత్వంలో నేతకు హైకోర్టు అక్షింతలు
తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ పై 2022లో పుదుచ్చేరి పోలీసులు నమోదు చేసిన కేసుపై తాజాగా విచారణ జరిగింది.
By: Tupaki Political Desk | 29 Aug 2026 2:00 PM ISTచట్టానికి అంతా సమానమే.. మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరూ చట్టానికి అతీతులు కాదు. చివరికి చట్టాలు చేసే చట్టసభ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానిమంత్రి పదవులలో ఉన్న ఎవరైనా సరే.. చట్టం ముందు సమానమే. అధికారంలో ఉన్నంత మాత్రాన ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవు. మద్రాస్ హైకోర్టు తాజాగా ఈ అంశాన్ని మరోమారు స్పష్టం చేసింది. తాను మంత్రి పదవిలో ఉన్నందున కోర్టు విచారణకు రాలేనని, మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ చేసిన విజ్ఞప్తిపై తీవ్రంగా స్పందించింది. చట్టం ముందు ఎవరైనా సమానమేనని స్పష్టం చేస్తూ చీవాట్లు పెట్టింది.
తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ పై 2022లో పుదుచ్చేరి పోలీసులు నమోదు చేసిన కేసుపై తాజాగా విచారణ జరిగింది. అయితే తాను మంత్రిగా ఉన్నందున కోర్టుకు రాలేనంటూ మరియా విల్సన్ అఫిడవిట్ వేయగా, హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘మీరేమి ఇంగ్లండ్ కు రాజు కాదు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంతటి వారే న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకంటే మీరేమీ గొప్పవారు కాదు, మంత్రులకు ప్రత్యేక చట్టాలు ఉండవు. విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ తీర్పు వెలువరించారు.
2022లో పుదుచ్చేరిలోని తన సోదరుడు, మరదలిపై దాడికి సంబంధించి విల్సన్ పై లాస్ పేట పోలీసులు కేసు నమదు చేశారు. పుదుచ్చేరి క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం ఉదయం విచారణ జరిగింది. మరియా విల్సన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాసనసభ సమావేశాల కారణంగా బిజీగా ఉండటంతో దిగువ కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని, అందువల్ల హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కోర్టుకు హాజరుకాకపోవడం గర్హనీయమని వ్యాఖ్యానించింది.
గతంలో నిత్యం కోర్టుకు వచ్చిన విల్సన్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత గైర్హాజరు అవడాన్ని కోర్టు గుర్తు చేసింది. ఇదే సమయంలో పుదుచ్చేరి పోలీసుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుని మంత్రి బిజీగా ఉంటే వేలాంకణి ఉత్సవాలకు ఎలా వెళ్ల గలుగుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ మంత్రి దిగువ కోర్టులో ఎప్పుడు హాజరవుతారో తెలుసుకుని చెప్పాలని న్యాయవాదిని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది. కాగా, మంత్రి సెప్టెంబరు 9న విచారణకు హాజరు అవుతారని, అదే సమయంలో కేసును కొట్టివేయాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరగా, కోర్టు సానుకూలంగా స్పందించింది.
కాగా, మంత్రి మరియా విల్సన్ ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి విల్సన్ కేసులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ దేశంలో చాలా మంది నాయకులకు ఈ మాటలు వర్తిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన చట్టం, న్యాయం వేరుగా ఉంటాయని భావిస్తే పొరపాటుని కోర్టు వ్యాఖ్యలు రుజువు చేశాయని అంటున్నారు.
