Begin typing your search above and press return to search.

కాలేజీల్లో రాజకీయాలు, జెండాలు.. లోకేష్ సంచలన నిర్ణయాలు!

అవును... స్కూల్స్, కాలేజీలు, యునివర్శిటీల్లో రాజకీయాలు ఇటీవల వెర్రి తలలు వేస్తున్నాయనే చర్చ బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే!

By:  Raja Ch   |   22 Nov 2025 11:11 AM IST
కాలేజీల్లో రాజకీయాలు, జెండాలు.. లోకేష్ సంచలన నిర్ణయాలు!
X

ఒకప్పుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉండేవారు చాలా మంది గొప్ప గొప్ప నాయకులు! నాడు కాలేజీల్లో రాజకీయాల్లో ఒక హుందాతనం, వారి అవసరాలకు తగ్గ సమస్యల నివేదన, విద్యార్థి సమస్యలపై విశ్లేషణలతో కూడిన విమర్శలు కనిపించేవి అనేది వాస్తవం! అయితే నేడు ఆ వ్యవహారం వెర్రితలలు వేస్తుందనే చర్చ విపరీతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు!

అవును... స్కూల్స్, కాలేజీలు, యునివర్శిటీల్లో రాజకీయాలు ఇటీవల వెర్రి తలలు వేస్తున్నాయనే చర్చ బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరయ్యారు.

ఇదే సమయంలో... ఇతర అధికారులతో పాటు ఎస్.ఎఫ్.ఐ., ఏ.ఎస్.ఎఫ్.ఐ., ఎన్.ఎస్.యూ.ఐ., పీ.డీ.ఎస్.యూ., ఏ.ఐ.డీ.యూ.ఎఫ్., డీ.ఐ.ఎఫ్.ఐ., ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలేజీలు, యూనివర్శిటీలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ యూనియన్లు పదకొండు పాయింట్ల జాబితాను సమర్పించాయి.

ఈ సందర్భంగా స్పందించిన లోకేష్... గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో ఉంచిందని, కొత్త ప్రభుత్వం ఈ మొత్తాన్ని దశలవారీగా విడుదల చేస్తుందని చెబుతూ... చెల్లించని ఫీజుల గురించి విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

కాలేజీల్లో రాజకీయాలకు నో ఛాన్స్!:

ఈ సందర్భంగా అన్ని కాలేజీల్లోనూ ర్యాగింగ్, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే... ఏ కాలేజీ లేదా యూనివర్శిటీల లోపల రాజకీయ ప్రసంగాలు, రాజకీయ జెండాలను అనుమతించబోమని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. అయితే... కాలేజీ సమయం తర్వాత ప్రత్యేక వేదికపై రాజకీయేతర అంశాలపై చర్చించవచ్చని వివరించారు.

మిగిలిపోయిన సీట్ల విషయంలో కీలక నిర్ణయం!:

ఈ సందర్భంగా... ఆయా యూనివర్సిటీల్లో మిగిలిపోయిన సీట్లకు నేరుగా అడ్మిషన్లు కల్పించాలని విద్యార్థి నాయకులు అడిగారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్... విద్యార్థులు కనీసం ప్రాథమిక అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని తెలిపారు. ఏది ఏమైనా... ఈ ఏడాది కాలేజీల్లో అడ్మిషన్లు ఆలస్యం కావని.. వచ్చే ఏడాది ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఈ ఏడాదే ప్రకటిస్తామని.. పరీక్షలూ సకాలంలో జరుగుతాయని తెలిపారు.

యూనివర్సిటీలో ఖాళీగా వేల అధ్యాపక పోస్టులు!:

ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలలో నాలుగు సుమారు 4,300లకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ధృవీకరించిన లోకేష్.. చట్టపరమైన సమస్యలు పరిష్కారమైన వెంటనే ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీని ప్రారంభిస్తుందని ఆయ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా... అన్ని క్యాంపస్ లలోనూ విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం, వార్డెన్లు, కుక్ ల వంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి డిమాండ్లను విద్యార్థి సంఘాలు లేవనెత్తాయి.