మందుల నుంచి వ్యాధి వరకు క్లియర్ ఇన్ఫో… రోగుల హక్కులలో కొత్త మార్పు
ఈ నిర్ణయం వెనుక కేవలం అక్షరాల మార్పు మాత్రమే కాదు, రోగి ఆరోగ్య హక్కులకు సంబంధించిన ఒక పెద్ద విప్లవమే ఉంది.
By: Madhu Reddy | 17 Sept 2026 3:57 PM ISTవైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లలో తికమక చేతిరాతలు, అర్థం కాని యమభాష దశాబ్దాలుగా రోగులను వేధిస్తున్న సమస్య. దీనికి ముగింపు పలుకుతూ జాతీయ ఆరోగ్య మిషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై మందుల పేర్లను స్పష్టమైన క్యాపిటల్ లెటర్లలో, కేవలం ఫార్ములా పేర్లతోనే రాయాలని ఆదేశించింది. అంతేకాకుండా రోగి బిపి, షుగర్, ఇతర ఆరోగ్య వివరాలను కూడా ప్రిస్క్రిప్షన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక కేవలం అక్షరాల మార్పు మాత్రమే కాదు, రోగి ఆరోగ్య హక్కులకు సంబంధించిన ఒక పెద్ద విప్లవమే ఉంది.
రహస్యాల వైద్యానికి ముగింపు: రోగికి తెలిసే హక్కు:
ఇన్నాళ్లూ డాక్టర్లు ఏం రాశారో, తమ శరీరంలోకి ఏ రసాయనాలు వెళ్తున్నాయో తెలియక రోగులు గుడ్డిగా మందులు వాడేవారు. నా శరీరంలోకి వెళ్లే మందు ఏంటి, దాని ప్రభావం ఏమిటి అని తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రతి రోగికీ ఉంది. ఐకే ఎన్హెచ్ఎం తెచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ పారదర్శకతకు పునాది వేస్తున్నాయి. వైద్యం అనేది ఒక గోప్యమైన వ్యాపారం కాదని, రోగితో స్పష్టంగా పంచుకోవాల్సిన బాధ్యత అని ఇది నిరూపిస్తోంది.
బ్రాండ్ల మాయాజాలం బంద్: ఫార్ములాకే ప్రాధాన్యం:
డాక్టర్లు బ్రాండ్ పేర్లు కాకుండా కేవలం ఫార్ములా పేరు మాత్రమే రాయాలనే నిబంధన రోగులకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. నిర్దిష్ట బ్రాండ్ పేరు రాసినప్పుడు రోగి ఆ కంపెనీ మందులకే పరిమితమై ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అదే ఫార్ములా పేరు రాస్తే, మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాణ్యమైన జనెరిక్ మందులను ఎంచుకునే స్వేచ్ఛ రోగికి లభిస్తుంది. ఇక ఇది ఫార్మా కంపెనీల అనుచిత వ్యాపార ధోరణులకు చెక్ పెడుతుంది.
వైద్యుల బాధ్యత.. రోగుల భద్రత:
ప్రిస్క్రిప్షన్ మీద రోగికి ఉన్న అలర్జీలు, బిపి, షుగర్ వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేయడం వల్ల వైద్య నిర్లక్ష్యం చాలా వరకు తగ్గుతుంది. ఒక వైద్యుడి దగ్గర వాడిన మందుల వివరాలు మరొక వైద్యుడికి సులభంగా అర్థమవుతాయి. దీనివల్ల పొరపాటున వికటించే మందులు ఇచ్చే ప్రమాదం తప్పుతుంది. ఇక చికిత్స విధానంలో ప్రొఫెషనల్ ఎథిక్స్ పెరిగి, రోగి ప్రాణాలకు గరిష్ట భద్రత లభిస్తుంది.
వైద్యం అనేది కేవలం మందులు రాయడంతో ముగిసిపోయే ప్రక్రియ కాదు, రోగికి పూర్తి అవగాహన కల్పించే సామాజిక బాధ్యత. కోర్టులు, ఆరోగ్య మిషన్లు ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వైద్యులు స్వచ్ఛందంగా తమ శైలిని మార్చుకున్నప్పుడే నిజమైన మార్పు వస్తుంది. ఇక అర్థమయ్యే రాత, పారదర్శకమైన చికిత్స ద్వారా డాక్టర్ మరియు రోగి మధ్య నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రోగుల హక్కులను గౌరవించడమే ఏకైక మార్గం.
