Begin typing your search above and press return to search.

పెట్రోల్ బంకా.. ఇన్సూరెన్స్ ఆఫీసా? పెట్రోల్ పోయరా? ఇదేందయ్యా సామీ

వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుంటే పెట్రోల్ నిరాకరించే ‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ విధానాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో హరియాణా, యూపీలోని 10 బంకుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు సమాచారం. ఏఎన్‌పీఆర్ కెమెరాలతో పాలసీ వివరాలు తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ఆధారంగా ప్రీమియం పెంపుపైనా ఆలోచన జరుగుతోంది. సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది.

By:  A.N.Kumar   |   26 Nov 2026 10:47 AM IST
పెట్రోల్ బంకా.. ఇన్సూరెన్స్  ఆఫీసా? పెట్రోల్ పోయరా? ఇదేందయ్యా సామీ
X

ఇప్పటివరకు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటే జేబులో డబ్బులుంటే చాలు అనుకునే అమాయకపు రోజులు త్వరలో చరిత్రలో కలిసిపోయేలా ఉన్నాయి. వంద రూపాయల పెట్రోల్ కొట్టండి భయ్యా అని అడిగితే.. నాజిల్ పట్టుకునే ముందు బంకు సిబ్బంది లేదా అక్కడి హైటెక్ కెమెరా మీ బండి బీమా జాతకం తీసి సారీ బ్రో.. మీ పాలసీ నిన్న అర్ధరాత్రి 12 గంటలకే ఎక్స్‌పైర్ అయింది.. బండి తోసుకుంటూ వెళ్లండి అని చెప్పే సీన్లు త్వరలో కనిపించేలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాలు తగ్గించడం.. బాధ్యత పెంచడం కోసం 'నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్' అనే కొత్త స్క్రిప్ట్‌ను కేంద్రం తెరపైకి తెస్తోంది. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని 10 బంకుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెట్టబోతున్నారు.

ఇప్పటివరకు బంకు దగ్గర క్యూ కడితే మన ముందున్న బండికి ఎంత పెట్రోల్ కొడుతున్నారు.. మీటర్ కరెక్ట్‌గా తిరుగుతోందా లేదా అనే టెన్షన్ ఉండేది. ఇకపై ఆ టెన్షన్‌తో పాటు కొత్త బెంగ మొదలవుతుంది..

ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్.పీఆర్) కెమెరాలు మన బండి నంబర్‌ను క్షణాల్లో చదివి.. సర్వర్‌తో మాట్లాడి.. మన ఇన్సూరెన్స్ యాక్టివ్‌లో ఉందో లేదో డిసైడ్ చేస్తాయట. ఒకవేళ సర్వర్ డౌన్ అయితే? లేదా మన పాలసీ రిన్యూవల్ డేటా అప్‌డేట్ అవ్వడానికి ఇంకో రెండు గంటలు పడితే? పెట్రోల్ ట్యాంక్ రిజర్వ్ లో ఉన్నా.. మన బండి ఇన్సూరెన్స్ రిజర్వ్ లో ఉండిపోతుందేమో.. అప్పుడు బంకు దగ్గర పెట్రోల్ కోసం కాదు.. పాలసీ డాక్యుమెంట్ల కోసం వాదనలు మొదలయ్యేలా ఉన్నాయి.

ఇప్పటివరకు హెల్మెట్ లేకుండా వెళ్తే చలాన్.. సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్. ఇకపై ఆ ఫైన్లతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డు ఆధారంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెంచే ఆలోచనలో ఉన్నారట. అంటే ఏడాదిలో రెండుసార్లు సిగ్నల్ దాటితే వచ్చే ఏడాది ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఏజెంట్ నవ్వుతూ సార్.. మీ డ్రైవింగ్ స్పీడ్‌కు తగ్గట్టు ప్రీమియం కూడా స్పీడ్‌గా పెరిగింది అని బిల్లు చేతిలో పెడతాడేమో.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అనేది ఇకపై కేవలం భద్రత కోసమే కాదు.. జేబు రక్షణ కోసం కూడా అత్యవసరమవుతుంది.

రోజు పొద్దున్నే లేచి బండి తాళం తిప్పేటప్పుడు ఇకపై ప్రశ్నలు మారిపోతాయి. బండిలో పెట్రోల్ ఉందా? అనే పాత ప్రశ్న పక్కకు వెళ్లిపోతుంది. ఇన్సూరెన్స్ గడువు ఇంకా ఉందా? బంకు కెమెరా మనల్ని లోపలికి రానిస్తుందా? అనే కొత్త టెన్షన్ మొదలవ్వడం ఖాయం..

అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చి దారిలో పెట్రోల్ అయిపోతే పరిస్థితి ఏంటనేది ఆలోచించాల్సిన విషయమే. నిబంధనలు కఠినంగా ఉండటం మంచిదే కానీ సాంకేతిక లోపాలు.. అత్యవసర పరిస్థితులపై స్పష్టత లేకపోతే సామాన్యుడికి కొత్త తలనొప్పులు తప్పవు. రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు కేవలం ఇంధన కేంద్రాలుగానే కాకుండా.. ఇన్సూరెన్స్ చెక్‌పోస్టులుగానూ మారిపోయేలా ఉన్నాయి..