'ఓటీటీ' లపై కేంద్రం సంచలన ప్రకటన.. మంచిదేనా?
అయితే.. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంటుకు చేరింది. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సంచలన సమాధానం చెప్పింది.
By: Garuda Media | 18 Dec 2025 4:07 PM ISTఓటీటీ(ఓవర్ ది-టాప్)లకు సంబంధించి కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. పిల్లలు చూడలేని.. చూడకూడని కంటెంట్లను కూడా.. నిర్విరామంగా ప్రసారం చేయడంతో పాటు నియంత్రణ లేకుండా పోతోందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం నియంత్రణ విధించాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే.. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంటుకు చేరింది. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సంచలన సమాధానం చెప్పింది.
ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదని కేంద్ర సమాచార శాఖ మంత్రి, తమిళనాడుకు చెందిన ఎంపీ ఎల్. మురుగన్ స్పష్టం చేశారు. డిజిటల్ వినోదంలో మార్పుల నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్రం ఎలాంటి నిబంధనలు వర్తింపచేయలేదని.. ఇకముందు కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. ఓటీటీలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని, వీటికి ప్రత్యేక మూడంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుందని మురుగన్ చెప్పారు.
ఐటీ రూల్స్-2021 ప్రకారం అక్రమ కంటెంట్ నిరోధం, వయస్సు ఆధారిత వర్గీకరణ ఓటీటీల బాధ్యతగా మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ అమల్లో ఉందన్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసు కునే అవకాశం కానీ.. ప్రతిపాదనలు కానీ.. తమ వద్దలేవన్నారు. ఓటీటీల విషయంలో వినియోగదారుల ఐచ్ఛికానికి(ఆప్షన్) మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రైవేటు కోసమేనా?
కాగా, కేంద్రం చేసిన ప్రకటనపై ఎంపీలు నిప్పులు చెరిగారు. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు... కేంద్రం వాటికి వెన్నుదన్నుగా నిలుస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో వంటి కీలక పెట్టుబడిదారీ సంస్థలకు ఓటీటీ ప్రధాన వేదికగా మారిందని, అందుకే కేంద్రం మౌనంగా ఉందని ఆరోపించారు.
