నెయ్యి కల్తీ కానీ జంతుకొవ్వు కలవలేదన్న వైవీ.. ఇంకేమన్నారంటే?
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యికి సంబంధించిన వివాదం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
By: Garuda Media | 30 Jan 2026 9:45 AM ISTతిరుమల లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యికి సంబంధించిన వివాదం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. ఈ అంశంపై ఏర్పాటు చేసిన సిట్ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలే. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ అంశం.. అందులో జంతుకొవ్వు కలిసిందన్న ఆందోళనల గురించి తెలిసిందే. అయితే.. అందులో జంతు కొవ్వు లేదని సిట్ ఛార్జిషీట్ చెప్పినట్లుగా టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
వైసీపీ ప్రభుత్వంలో స్వామివారికి సమర్పించిన ప్రసాదంలో నెయ్యికి బదులు జంతుకొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. ‘‘అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం లేదు. అందుకే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాను. సుప్రీంకోర్టు రెండు అంశాలపై సిట్ ఏర్పాటు చేసింది. 2024 జులై లో సరఫరా చేసిన నెయ్యిలో జంతుకొవ్వు ఉందా? లేదంటే కల్తీ అయ్యిందా? జంతుకొవ్వు కలిసి ఉంటే ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదం తయారీలో వాడారా? లేదా? అనే విషయాలపై నిర్దారించాలని ఆదేశించింది’’ అని పేర్కొన్నారు.
తాజాగా సిట్ ఛార్జ్ షీట్ లో నెయ్యిలో కల్తీ జరిగింది కానీ అందులో జంతుకొవ్వు లేదని చాలా స్పష్టంగా చెప్పిన వైనాన్ని పేర్కొంటూ.. ‘‘జంతుకొవ్వు కలిసిన నెయ్యిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేశారని 2024 జులైలో వచ్చిన నెయ్యి నమూనాల్లో తేలిందన్న ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వం దీనికేం సమాధానం చెబుతారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. తాను.. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి ఇన్ని కోట్ల లడ్డూల తయారీకి ఇన్ని లక్షల కేజీల కల్తీ నెయ్యి కొన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారన్న వైవీ సుబ్బారెడ్డి.. ‘‘మరోసారి కోర్టును ఆశ్రయిస్తా’’ అని పేర్కొన్నారు. మొత్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది కానీ జంతుకొవ్వు కలవలేదన్న విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారని చెప్పాలి.
