షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై TSHRC డీజీపీకి గడువు
ఈ ఘటనపై TSHRC అత్యంత వేగంగా చర్యలు చేపట్టింది. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
By: A.N.Kumar | 21 Oct 2025 8:39 PM ISTనిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనపై కమిషన్ స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో ప్రచురించబడిన కథనాలను ఆధారం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
* కేసు నేపథ్యం
పోలీస్ కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతను సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో షేక్ రియాజ్ అక్కడికక్కడే మరణించాడు.
* TSHRC ఆదేశాలు: కీలక అంశాలపై నివేదిక తప్పనిసరి
ఈ ఘటనపై TSHRC అత్యంత వేగంగా చర్యలు చేపట్టింది. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై పూర్తి, సమగ్ర నివేదికను సమర్పించాలని కోరింది. కమిషన్ ముఖ్యంగా ఈ అంశాలపై స్పష్టమైన సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని కోరింది.. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితుల వివరాలు... సంఘటనపై మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ ప్రారంభమైందా, దాని ప్రస్తుత స్థితి.. సుప్రీంకోర్టు - జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఎన్‌కౌంటర్ కేసులపై జారీ చేసిన మార్గదర్శకాలను ఎంతవరకు పాటించారని ప్రశ్నించింది. సంబంధిత ఎఫ్ఐఆర్ (FIR) , పోస్ట్‌మార్టం నివేదిక కాపీలు అందించాలని కోరింది. TSHRC ఈ పూర్తి నివేదికను 24.11.2025 తేదీలోగా సమర్పించాలని డీజీపీకు గడువు విధించింది.
* సుమోటో కేసుతో లోతైన విచారణ
మానవ హక్కుల కమిషన్ ఈ సుమోటో కేసు నమోదు చేయడం ద్వారా, నిజామాబాద్ ఎన్‌కౌంటర్ మరణంపై మరింత లోతైన, సవివరమైన విచారణ జరగనుందని తెలుస్తోంది. న్యాయపరమైన, మానవ హక్కుల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సంఘటనపై పారదర్శకతను పెంచేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-రియాజ్ కేసులో జరిగింది ఇదీ
నిజామాబాద్‌లో సీసీ ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య జరిగి ప్రజలను షాక్ ఇచ్చింది. విధి నిర్వహణలో రియాజ్‌ను విచారణకి తీసుకెళ్తుండగా, అతడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి ప్రమోద్ ప్రాణాలు తీసుకున్నాడు. తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలించినా ఆయన మృతి చెందాడు. జిల్లా కమిషనర్ సాయి చైతన్య, పోలీసు కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రియాజ్ గతంలో దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్న రౌడీ. ప్రమోద్ హత్య తర్వాత పోలీసుల గాలింపు ఫలితంగా రియాజ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించినపుడు, పోలీసులు ఆత్మరక్షణలో కాల్పులు జరిపి అతన్ని కాల్చారు. ఈ కాల్పుల్లో రియాజ్ మరణించారు.. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకారం, ఇది ఆత్మరక్షణ కారణంగా జరిగిన ఘటన. దీనిపై తాజాగా మానవహక్కుల సంఘం స్పందించింది.
