కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ కాల్పుల్లో మృతి
ప్రమోద్ తన విధి నిబద్ధతతో రియాజ్‌ను బైక్‌పై విచారణ కోసం తీసుకెళ్తున్న సమయంలో రియాజ్ అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. చాతి భాగంలో అనేక పర్యాయాలు పొడవడంతో ప్రమోద్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
By: A.N.Kumar | 20 Oct 2025 5:08 PM ISTసిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య నిజామాబాద్ జిల్లా ప్రజలను కుదిపేసింది. ఈ ఘటనలో విధి నిర్వాహణలో భాగంగా నేరస్థుడు రియాజ్‌ను విచారణ నిమిత్తం తీసుకెళ్తుండగా.. అతడి చేతిలోనే ప్రమోద్ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పోలీసు శాఖనే కాకుండా మొత్తం తెలంగాణ ప్రజల మనసును ఈ ఘటన కదిలించింది.
* దారుణ దాడి – కన్నీర్లో మునిగిన పోలీసు కుటుంబం
ప్రమోద్ తన విధి నిబద్ధతతో రియాజ్‌ను బైక్‌పై విచారణ కోసం తీసుకెళ్తున్న సమయంలో రియాజ్ అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. చాతి భాగంలో అనేక పర్యాయాలు పొడవడంతో ప్రమోద్ తీవ్ర గాయాలపాలయ్యాడు. సభ్య సమాజం చూస్తుండగానే జరిగిన ఈ ఘటనలో ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆసుపత్రికి తరలించినా ప్రమోద్ ప్రాణాలు నిలువలేదు. ఈ ఘటనపై జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కన్నీటి పర్యంతమయ్యారు. “శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా చివరికి సమాజం కోసం ప్రాణాలు త్యాగం చేయాల్సి రావడం దురదృష్టకరం” అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరఫున ప్రమోద్ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
* రియాజ్ నేర ప్రస్థానం – నయీమ్‌లా రెచ్చిపోయిన రాక్షసుడు
రియాజ్ పేరు నిజామాబాద్ ప్రజలకు కొత్త కాదు. దొంగతనాలు, దోపిడీలు, బెదిరింపులు, హత్యలు.. ఇలా దాదాపు 60కి పైగా కేసుల్లో అతడు నిందితుడు. పక్కింటి కుర్రాడిలా కనిపించినా, అంతరంగంలో మాత్రం క్రూర నేరగాడు. రౌడీయిజంతో రియాజ్ నగరంలో నయీమ్‌లా రెచ్చిపోయాడు.
*న్యాయానికి ముగింపు.. పోలీసుల కాల్పుల్లో రియాజ్ అంతం
ప్రమోద్ హత్య తర్వాత పోలీసులు రియాజ్ కోసం గాలింపు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కుని కాల్పులు జరపబోతున్న సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేశారు. ఆ ఘటనలో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. “రియాజ్ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులపై కాల్పులు చేయబోయాడు. ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు” అని తెలిపారు.
ప్రమోద్ త్యాగానికి సార్థక నివాళి
రియాజ్ మృతితో కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తోందని సహచరులు చెబుతున్నారు. విధి పట్ల నిబద్ధతతో ప్రాణాలర్పించిన ప్రమోద్ త్యాగం తెలంగాణ పోలీసు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆయన ధైర్యసాహసం, విధి నిబద్ధత యువ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రమోద్ చనిపోయినా ఆయన ధైర్యం చావలేదని కొనియాడారు.
