కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సినిమా ట్విస్టు.. నిందితుడు అరెస్టుపై భిన్న కథనాలు!
తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కానిస్టేబుల్ హత్యకు గురికాగా, నిందితుడు రియాజ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
By: Tupaki Political Desk | 19 Oct 2025 7:19 PM ISTతెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కానిస్టేబుల్ హత్యకు గురికాగా, నిందితుడు రియాజ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు 8 ప్రత్యేక పోలీసు బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టి ఆదివారం మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పోలీసుల నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని కొందరు చెబుతుండగా, నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆ కథనాలను ఖండించారు.
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత తప్పించుకుని పారిపోయిన నిందితుడు రియాజ్.. సారంగపూర్ అనే గ్రామ శివార్లలో ఓ పాడైపోయిన లారీ క్యాబిన్ లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే అతడిని పట్టుకుని వెళ్లేందుకు పోలీసులు వెళ్లగా, అక్కడ మరో కానిస్టేబుల్ పై నిందితుడు రియాజ్ దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రియాజ్ ను ఎన్ కౌంటర్ చేశారని తొలుత ప్రచారం జరుగగా, అటువంటిదేమీ లేదని సీపీ సాయిచైతన్య స్పష్టం చేస్తున్నారు. అయితే రియాజ్ గాయపడ్డాడని, అతడిని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారని మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
దీంతో నిజామాబాద్ పోలీసు కానిస్టేబుల్ హత్యోదంతంలో సినిమా ట్విస్టులు చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. నిందితుడు రియాజుకు సుదీర్ఘ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. గత మూడేళ్లలో సుమారు 40 కేసులు అతడిపై నమోదయ్యాయని సమాచారం. ఖరీదైన బైకులు, బుల్లెట్ దొంగతనాల్లో ఆరితేరిపోయిన నిందితుడు రియాజ్ నిజామాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న కానిస్టేబుల్ రియాజ్ అతడిని పట్టుకునేందుకు వెళ్లగా, రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో కాలువలో దూకేశాడు. అయితే కానిస్టేబుల్ ప్రమోద్ తన మేనల్లుడు ఆకాశ్ తో కలిసి నిందితుడు రియాజ్ ను పట్టుకున్నాడు. ఆ వెంటనే ఎస్సై విఠల్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇక నిందితుడుని పోలీసుస్టేషన్ కి తరలించే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ ద్విచక్రవాహనంపై రియాజ్ ను మధ్యలో కూర్చొబెట్టుకుని వెళుతుండగా, మార్గమధ్యలో కత్తితో కానిస్టేబుల్ గుండెలో పొడిచి హతమార్చాడు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, డీజీపీ శివధర్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. నిందితుడి అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారైన రియాజ్ కోసం పోలీసులు 48 గంటలుగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అతడి ఆచూకీపై సమాచారం అందడంతో పట్టుకున్నారని అంటున్నారు. అయితే ఈ క్రమంలో అతడు గాయపడటం, ఆస్పత్రికి తరలించడం కలకలం సృష్టించింది. నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారని తొలుత వార్తలు ప్రసారం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే నిందితుడు ప్రాణాలతోనే ఉన్నాడని కమిషనర్ సాయిచైతన్య వెల్లడించారు. కానీ, నిందితుడు ఆస్పత్రిలో ఉండటంతో ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
