నితీష్ గుర్రుగా ఉన్నారా...ఎన్నాళ్ళీ వెయిటింగ్ ?
ఇక బీహార్ లో తాజాగా జరిగిన బకీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేడీయూ తన మద్దతు బీజేపీకి పూర్తిగా అందించలేదని అంటున్నారు.
By: Satya P | 9 Aug 2026 9:50 AM ISTబీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ని చాలా మంది ఇప్పటికే మరచిపోయి ఉంటారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ దాకా చాలా యాక్టివ్ గా ఉంటూ పాలిటిక్స్ చేశారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన బీహార్ కి సుదీర్ఘ కాలం సీఎం గా వ్యవహరించారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి పెద్దల సభకు సభ్యుడు అయ్యారు. ఆయన కుమారుడు నిషాంత్ కుమార్ ని బీహార్ ప్రభుత్వంలో చేర్చుకుని ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా పెద్దాయన నితీష్ కుమార్ కి మాత్రం ఎక్కడా అకామిడేషన్ అయితే లేదు. ఇలా సీఎం పదవికి రాజీనామా చేస్తే అలా కేంద్ర మంత్రి పదవి అని అంతా చెప్పుకున్నారు. కానీ జరిగేది చూస్తే వేరుగా ఉంది అని అంటున్నారు. దాంతోనే నితీష్ వర్గం మండిపోతోంది అని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఎక్కడా అయిపూ లేదుగా :
నితీష్ కుమార్ జేడీయూ అధ్యక్షుడు. ఆయన ఎన్డీయే మిత్ర పక్షం అధినేతగా సమావేశాలకు హాజరు కావచ్చు. కానీ ఆయన గడచిన నాలుగు నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు, పైగా ఆయన గొంతు కూడా వినిపించడం లేదు, దాంతో అసలు ఏమి జరుగుతోంది, ఈ బీహారీ బాబు మంచి ఫైర్ మీద ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక నితీష్ కుమార్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నారు. ఆయనది అక్షరాల యాభై ఏళ్ళ రాజకీయ జీవితం. 1977 నుంచే ఆయన రాజకీయంగా చురుకుగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానమంత్రి మెటీరియల్. అలాంటి నితీష్ కుమార్ కి కేబినెట్ మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి ఆలస్యం చేస్తున్నారు అన్న బాధ అయితే జేడీయూ క్యాడర్ లో ఉంది అని అంటున్నారు.
దెబ్బ తీశారని అంటున్నారు :
ఇక బీహార్ లో తాజాగా జరిగిన బకీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేడీయూ తన మద్దతు బీజేపీకి పూర్తిగా అందించలేదని అంటున్నారు. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎటు పోయింది అన్నదే చర్చగా ఇపుడు ఉంది. తమ నాయకుడిని ముఖ్యమంత్రిని ఇలా చేసి అలా దించేశారు అన్న అసంతృప్తి అయితే క్యాడర్ లో ఉంది అని అంటున్నారు. అందుకే వారు బీజేపీకి గుణ పాఠం చెప్పాలనే బీహార్ ఉప ఎన్నికల్లో సహకరించలేదని కూడా ప్రచారం సాగుతోంది. అంతే కాదు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ నే కొనసాగించకుండా బీజేపీ తప్పు చేసింది అన్న భావన కూడా వారిలో ఉంది అని అంటున్నారు.
ఆ వర్గం దూరమేనా :
ఇక బీహార్ లో నితీష్ సామాజిక వర్గం అయిన కూర్మీలు బకీంపూర్ లో అయిదు శాతం ఉన్నారని అంటున్నారు. వారు అంతా చేతులెత్తేయడంతోనే బీజేపీకి ఘోర ఓటమి సంభవించింది అని అంటున్నారు. నితీష్ సీఎం గా ఉంటే ఈ పరిస్థితి అసలు వచ్చేది కాదని కూడా చాటి చెప్పాలనే ఇలా చేశారు అని అంటున్నారు. ఇక నితీష్ కుమార్ రాజకీయంగా మంచి వ్యూహకర్త అన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాలు స్మార్ట్ గా ఉంటాయని గుర్తు చేస్తున్నారు.
గాలి మారితే మాత్రం :
నితీష్ కి జనం నాడి పట్టుకునే సామర్ధ్యంతో పాటు ఏ వైపున గాలి వీస్తే ఆ వైపున ఎలాంటి శషబిషలు లేకుండా వాలిపోయే నైపుణ్యం కూడా ఉందని అంటున్నారు. ఆయనకు అందరూ మిత్రులే అని కూడా చెబుతున్నారు. దాంతో ఇపుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు జెన్ జీ యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం రానున్న పర్యవసానాలు అన్నీ ఊహించలేనంత అమాయకుడు నితీష్ కుమార్ కారని అంటున్నారు. అందువల్ల ఆయన ప్రస్తుతానికి గుర్రుగా ఉంటూ గుంభనంగా ఉంటున్నా సరైన సమయంలో సరైన నిర్ణయంతో వ్యూహాలను అమలు చేసే తెలివిడి కలిగిన రాజకీయ నేత అని అంటున్నారు. చూడాలి మరి ఈ బీహారీ బాబు ఏమి చేస్తారో. కేబినెట్ మంత్రిగా ఎపుడు గద్దెనెక్కుతారో.
