Begin typing your search above and press return to search.

ఒకసారి ఎమ్మెల్యే, ఆరు సార్లు ఎంపీ.. 20 ఏళ్లుగా సీఎం ఇలా సాధ్యం..!

అదే జరిగితే... సీఎంగా నితీశ్ ఐదోసారి బాధ్యతలు స్వీకరించడంతోపాటు 20+ ఇయర్స్ ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డ్ సృష్టిస్తారు.

By:  Raja Ch   |   15 Nov 2025 10:50 AM IST
ఒకసారి ఎమ్మెల్యే, ఆరు సార్లు ఎంపీ.. 20 ఏళ్లుగా సీఎం ఇలా సాధ్యం..!
X

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. నితీశ్ కుమార్ నాయకత్వాన్ని బీహార్ ఓటర్లు బలంగా నమ్మడం అని అంటున్నారు. మిగిలిన ఫ్యాక్టర్స్ ఎన్ని పనిచేసినా.. ఇది కీలకమని చెబుతున్నారు. ఈ సమయంలో నితీశ్ పొలిటికల్ కెరీర్ మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బిగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... బీజేపీ, జేడీయూతో పాటు మరో మూడు పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి తరుపున సీఎంగా మరోసారి నితీశ్ ప్రమాణస్వీకరం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే... సీఎంగా నితీశ్ ఐదోసారి బాధ్యతలు స్వీకరించడంతోపాటు 20+ ఇయర్స్ ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డ్ సృష్టిస్తారు.

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన 20 ఏళ్లుగా సీఎం!:

నితీశ్ కుమార్ రాజకీయం చాలామందికంటే భిన్నంగా ఉంటుందని అంటారు. తన పొలిటికల్ కెరీర్ లో తొలుత మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచిన ఆయన.. అనంతరం శాసనమండలి నుంచి ఎన్నికై ముఖ్యమంత్రి అవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... తొలుత 2000 సంవత్సరం మార్చి నెలలో ఒకసారి వారం రోజులు పాటు బీహార్ సీఎంగా పనిచేశారు.

అనంతరం 2004 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నితీశ్ – వాజ్ పేయి జోడి, బీహార్ లో ఎన్డీయేను అధికారంలోకి తెచ్చింది. దీంతో.. నితీశ్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు! ఫలితంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచినా.. 20 ఏళ్లుగా సీఎం కుర్చీపై కొనసాగారు నితీశ్ కుమార్. ఈ దఫా కూడా ఆయనను సీఎం కుర్చీ వరిస్తే... అది మరో చరిత్రగా మారబోతోంది!

15 ఏళ్లలో ఆరు ప్రత్యక్ష ఎన్నికల్లో...!

1985లో ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో 1989, 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా ఎంపీగా గెలిచారు. ఇలా 15 ఏళ్ల వ్యవధిలో ఆరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, గెలిచి తన సత్తా చాటారు. ఈ క్రమంలోనే.. ఎన్డీయే సర్కార్ లో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

కుటుంబ నేపథ్యం ఇదే!:

పాట్నా సమీపంలోని భక్తియ్యార్ పుర్ లో కవిరాజ్ రామ్ లఖన్ సింగ్, పరమేశ్వరి దంపతులకు 1951లో నితీశ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్.. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. ఇక.. నితీశ్ బీహార్ ఇంజినీర్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. తర్వాత స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కొంతకాలం పని చేసి, అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.