Begin typing your search above and press return to search.

బీహారీ బాబు నితీష్ కి చెక్ పెడుతున్న బీజేపీ ?

బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే ఆ సంగతి కొద్ది నెలలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చెప్పాలి

By:  Satya P   |   2 Aug 2025 4:00 AM IST
బీహారీ బాబు నితీష్ కి చెక్ పెడుతున్న బీజేపీ ?
X

బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే ఆ సంగతి కొద్ది నెలలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చెప్పాలి. అయితే దాని కంటే ముందు బీజేపీయే నితీష్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తప్పించేందుకు వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నితీష్ కుమార్ ఏకంగా పాతికేళ్ళుగా బీహార్ పీఠం మీద ముఖ్యమంత్రిగా పాతుకుని పోయారు. దాంతో జనాలలో కొత్త ఆలోచనలు వస్తున్నాయని తాజా సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

లాలూ కుమారుడి వైపు మొగ్గు :

బీహార్ లో చూస్తే రాజకీయ దృశ్యం మెల్లగా మారుతోంది. అక్కడ ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి బలంగా ఉంది. వాస్తవానికి 2020లోనే కూటమి నెగ్గాలి. కానీ బీజేపీ నితీష్ కాంబో బలంగా ఉండడం, మోడీ చరిష్మా నితీష్ పాలన అన్నీ కలసి ఎడ్జ్ లో ఎన్డీయే కూటమికి విజయాన్ని అందించాయి. అయితే ఈ అయిదేళ్ళలో పెరిగిన యాంటీ ఇంకెంబెన్సీ ఈ సమయంలోనే ఎన్డీయే ఇండియా కూటముల మధ్యకు మారుతూ నితీష్ మూడు సార్లు సీఎం గా ప్రమాణం చేయడం వల్ల ఆయన నిలకడ లేని రాజకీయ నాయకుడిగా జనంలో పేరు తెచ్చుకున్నారని అంటున్నారు. అలా నితీష్ ఇమేజ్ బాగా తగ్గిందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.

కాబోయే సీఎం గా :

అదే సమయంలో లాలూ కొడుకు ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ కే జనాలు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. స్టేట్ వైబ్ సర్వే ఆఫ్ బీహార్ తాజాగా చేసిన సర్వే ప్రకారం చూస్తే కనుక నితీష్ కి ప్రజాదరణ గణనీయంగా తగ్గిందని అంటున్నారు. ఈ సర్వే కులాల వారీగా తీసుకుని చేసింది. దీని ప్రకారం చూస్తే కేవలం 25 శాతం మంది మాత్రమే నితీష్ ని తరువాత సీఎం గా కోరుకుంటున్నారు. తేజస్వీ యాదవ్ ని సీఎం గా చూడాలని 32.1 శాతం ప్రజలు కోరుకోవడం విశేషం. ఇక ఎస్టీలు 38 శాతం, 27 శాతం ఎస్సీలు ముస్లింలు, 24 శాతం ఉన్నత వర్గం హిందువులు, 21 శాతం ఓబీసీలు ఉన్నారని తేలింది. అలాగే తేజస్వీ యాదవ్ విషయం తీసుకుంటే యాభై శాతం పైగా ముస్లింలు ఆయనే కాబోయే సీఎం అని అంటున్నారు.

ట్విస్ట్ ఇక్కడే ఉందిట :

ఇక బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తే ఆ పార్టీ సీఎం ని చూడాలని 33.7 శాతం మంది కోరుకుంటున్నట్లుగా వెల్లడి అయింది అదే బీజేపీ నితీష్ నే తమ కూటమి సీఎం గా ప్రకటిస్తే మాత్రం 23.1 మందే ఓటేస్తున్నారు. దాంతో బీజేపీలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయని అంటున్నారు. బీహార్ లో అధికారం ఏ కూటమిది అంటే మాత్రం ఆర్జేడీ నాయకత్వంలోని మహాఘటబంధన్ కే 36.1 మంది జై కొడితే ఎన్డీయే పక్షానికి 35.4 శాతం మంది మాత్రమే జై అంటున్నారుట.

బీజేపీ నుంచే కొత్త సీఎం :

ఈ సర్వే ఫలితాలు చూసిన తరువాత కమలనాధులు సరికొత్త ఆలోఅనలు చేస్తున్నారు అని అంటున్నారు. నితీష్ కుమార్ కి జనాదరణ బాగా తగ్గిన నేపధ్యంలో ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ అభ్యర్ధీ ప్రకటించాలని ఆలోచిస్తున్నారుట. దీని వల్ల ఫ్రెష్ లుక్ ఉంటుందని, ఎండీయే కూటమికి కొత్త బలం వస్తుదని ఆ పైన మోడీ ఇమేజ్ కూడా తోడు అయితే బీహార్ పీఠం బీజేపీ పరం అవుతుందని లెక్క వేస్తున్నారుట. నితీష్ ని సీఎం గా చూసి బోరెత్తిన బీహార్ జనాలకు బీజేపీ కొత్త ముఖాన్ని తమ పార్టీ నుంచి చూపించడం ద్వారా ఎన్డీయేని తిరిగి అధికారంలోకి తేవాలని చూస్తోంది. బీజేపీ ఆలోచనలు బాగానే ఉన్నా నితీష్ దానికి ఊరుకుంటారా అన్నదే పాయింట్. బీహారీ బాబుకు చెక్ పెడితే మాత్రం ఏమి జరుగుతుందో చూడాల్సిందే.