కుటుంబాన్ని త్యజించాను అంటున్న నితీష్ కుమార్
ఇక చూస్తే దేశంలో ఆసక్తిని పెంచుతున్న ఎన్నికగా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లో నిలిచాయి. జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ ఎన్నికలు.
By: Satya P | 1 Nov 2025 10:39 PM ISTచరిత్రలోకి వెళ్తే గౌతమ బుద్ధుడు ఇంటినీ ఇల్లాలినీ రాజ్యాన్ని అనుబంధాలను సర్వం త్యజించిన వారుగా కనిపిస్తారు. ఇక రాజకీయాల్లో ఉన్న వారు ఏమి త్యజించారు అంటే వారు కూడా చాలా త్యాగాలు చేస్తారు. ముఖ్యంగా కుటుంబాన్ని సొంత జీవితాన్ని అని అంటారు. చాలా మంది నిరంతరం రాజకీయాల్లో బిజీగా ఉంటూ తన వారికి ఎంతో దూరం అవుతారు. అలా వారు ఉండబట్టే రాజకీయంగా విజయవంతం అవుతారు. అదే సమయంలో వారి త్యాగాలకు జనాలు వెలకట్టి పదవులు ఇస్తారా లేక వారి సమర్ధత వారి సేవలకు మెచ్చి కిరీటాలు అందిస్తారా అంటే రెండవదే కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది.
హోరా హోరీ పోరులో :
ఇక చూస్తే దేశంలో ఆసక్తిని పెంచుతున్న ఎన్నికగా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లో నిలిచాయి. జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ ఎన్నికలు. దేశమంతా ఈ ఎన్నికల గురించి మాట్లాడుకుంటోంది. బీహార్ లో ఈసారి మార్పు వస్తుందా లేదా రాదా అన్నది కూడా ఉత్కంఠని పెంచుతోంది. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ కుర్చీ ఎక్కుతారా లేక మాజీగా మిగిలిపోతారా అన్నది కూడా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.
ఎమోషన్స్ పెంచుతున్నారు :
రాజకీయాలు అంటే అన్నీ కలబోస్తారు. సకల భావోద్వేగాలు అందులో మిళితం అవుతాయి. దాంతో పాటు ప్రజలకు ఏది కనెక్ట్ అవుతుందో దానిని గురి చూసి మరీ ప్రయోగిస్తారు. ఈ విషయంలో దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ పండిపోయిన నితీష్ కుమార్ కి వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అందుకే ఆయన తాజాగా తన ప్రచారంలో కానీ మీడియా సమావేశాల్లో కానీ కొత్త విషయాలు ప్రస్తావిస్తున్నారు. తాను ప్రజల కోసం ఎంతగానో పనిచేశానని ఆయన చెప్పుకున్నారు. ఈ క్రమంలో తాను కుటుంబాన్ని కూడా త్యజించాను అని ఆయన అంటున్నారు. తాను ఫ్యామిలీకి దూరంగా ఉంటూ గత రెండు దశాబ్దాలుగా ప్రజల కోసమే పరితపించాను అని ఆయన చెప్పడం జరుగుతోంది.
ప్రజల కోసమే :
ఇక తాను తొలిసారి సీఎం అయిన 2005 నుండి తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన తాజాగా ఒక వీడియో సందేశంలో హైలైట్ చేశారు. ఇప్పటివరకు తన ప్రభుత్వం అన్ని పనులు చేసిందని తనను లేదా తన కుటుంబాన్ని కాకుండా రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని పని చేసిందని ఆయన నొక్కి చెప్పారు. తాను కుటుంబాన్ని పక్కన పెట్టాను అని ప్రజల కోసమే పాటు పడ్డాను అని ఆయన చెప్పుకొచ్చారు. తనను బీహార్ ప్రజలే కుటుంబం అని నితీష్ కుమార్ అన్నారు. తాను బీహార్ నిరంతర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పనిచేశాను అని ఆయన అన్నారు.
మరోసారి ఆయనకు చాన్స్ :
తిరిగి ఎన్డీయే ని బీహార్ లో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే నితీష్ కుమార్ కుటుంబం కాకుండా ప్రజల కోసమే పనిచేశను అని అభివృద్ధిని చూపించాను అని అవినీతి కుటుంబ పాలన లేకుండా పాలించానని చెబుతున్న మాటలను జనాలు ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. నితీష్ కుమార్ పాలనను అనేకసార్లు మెచ్చి పట్టం కట్టిన ప్రజలు 2025 ఎన్నికల్లో మరోసారి ఆయనకు చాన్స్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.
