Begin typing your search above and press return to search.

నితిన్ బాటలో స్టాలిన్.. సక్సెస్ కొడతారా ?

తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్క కుటుంబానికి కార్డుకు మూడు వేల రూపాయల నగదుని ఇస్తున్నారు. అలాగే పొంగల్ గిఫ్ట్ పేరుతో ఇస్తున్నారు.

By:  Satya P   |   23 Dec 2025 9:35 AM IST
నితిన్ బాటలో స్టాలిన్.. సక్సెస్ కొడతారా ?
X

బీహార్ లో నితీష్ కుమార్ తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలవడానికి అనేక అస్త్రాలు వాడారు. అందులో పవర్ ఫుల్ గా పేలింది మహిళల ఖాతాలో పది వేల రూపాయలు వేయడం. అలా బీహార్ లో ప్రతీ మహిళ ఖాతాలో పెద్ద ఎత్తున నగదు జమ చేసిన తరువాత ఎన్నికలకు వెళ్ళారు. దాంతో బంపర్ విక్టరీ కొట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సీట్లతో ఐదవసారి సీఎం పీఠం ఎక్కారు. ఇపుడు ఆయన చూపించిన బాట అధికారంలో ఉన్న మిగిలిన సీఎంలకు కూడా సక్సెస్ రూట్ వేస్తోంది. 2026 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో సీఎం ఎంకే స్టాలిన్ కూడా తన వద్ద ఉన్న అస్త్రాలను బయటకు తీస్తున్నారు.

సంక్రాంతి కానుకగా :

తొందరలోనే తమిళనాడులో సైతం సంక్రాంతి పండుగ రాబోతోంది. మకర సంక్రాంతి పండుగను తమిళనాడులో పొంగల్ గా జరుపుకుంటారు. అక్కడ కూడా భోగీ సంకాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల వేడుక ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ పొంగల్ ని దృష్టిలో ఉంచుకుని అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం ప్రజలకు వరాలు ప్రకటించింది. ముఖ్యంగా రేషన్ కార్డుదారులకు అయితే భారీ నజరానా ఇస్తోంది. ఈ దెబ్బతో వారి లోగిళ్ళలో అసలైన సంక్రాంతి పండుగ వచ్చేలా డీఎంకే ప్రభుత్వం గుడ్ న్యూస్ ని చెప్పుకొచ్చింది.

రేషన్ కార్డు ఉంటే చాలు :

తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్క కుటుంబానికి కార్డుకు మూడు వేల రూపాయల నగదుని ఇస్తున్నారు. అలాగే పొంగల్ గిఫ్ట్ పేరుతో ఇస్తున్నారు. వీటితో పాటు పండుగ నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అంటే ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక పొడవాటి చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులను కూడా కిట్ రూపంలో ఇస్తున్నారు ఇవన్నీ ఒక భారీ ప్యాకేజీ రెడీ చేసి జనాలకు అందించనున్నారు. ఈ భారీ ప్రోగ్రాం ని ముఖ్యమంత్రి స్టాలిన్ జనవరి రెండవ వారంలో అంటే పొంగల్ కి ముందు ఘనంగా ప్రారంభించనున్నారు.

ఎన్నికల కోసమేనా :

ఎన్నికలు పొంగల్ తరువాత కొద్ది నెలలలోనే జరగనున్నాయి. ఎన్నికల ముందు తాయిలాలు అంటే ఎన్నికల సంఘం ఆంక్షల మధ్య వీలుపడదు, అందుకే పొంగల్ గిఫ్ట్ పేరుతో ఈ విధంగా ప్రతీ కుటుంబానికి మూడు వేల నగదు ఇవ్వడం ద్వారా స్టాలిన్ కొత్త వ్యూహాన్నే రచించారు అని అంటున్నారు. దీనిని ప్రేరణగా బీహార్ నితీష్ కుమార్ నిలిచారు అనుకోవాలి. ఆయన కూడా నవంబర్ లో ఎన్నికలు అంటే జూన్ నెలలో మహిళలకు పదివేల రూపాయల పధకం అమలు చేశారు. ఇపుడు స్టాలిన్ అదే రూట్ లో వెళ్తున్నారు, మరి నితీష్ భారీ సక్సెస్ కొట్టారు, స్టాలిన్ కూడా కొడతారా అన్నది చూడాల్సి ఉంది.

లబ్దిదారులు కోట్లలో :

ఇక చూస్తే తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా 2 కోట్లకు పైగా కుటుంబ రేషన్ కార్డులు ఉన్నాయి, వీటిలో 6.75 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. దీంతో అతి పెద్ద సెక్షన్ నే స్టాలిన్ టార్గెట్ చేశారు అని అంటున్నారు. వీరిలో సగానికి సగం మంది ప్రభుత్వం ఇచ్చిన ఈ పొంగల్ గిఫ్ట్ పట్ల సానుకూలంగా ఉన్నా డీఎంకే సర్కార్ కి మరోసారి అధికారం దక్కడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు చేతిలో అధికారం ఉంది కాబట్టి ఎన్నికలలో మరిన్ని హామీలు కూడా ముందే ఇచ్చి అమలు చేసే అవకాశం స్టాలిన్ కి ఉంది. మొత్తానికి డీఎంకే చరిత్రలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం అనే రేర్ ఫీట్ ని స్టాలిన్ సాధించాలని చూస్తున్నారు.