బీహార్ దంగల్: ఈ సెంటిమెంటు గురించి తెలుసా?!
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలు.. అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత.. ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కారు. కానీ, వీరు ఎక్కువ కాలం ఆ పీఠంపైకూర్చోలేక పోయారు.
By: Garuda Media | 15 Oct 2025 10:00 PM ISTరాజకీయాల్లో సెంటిమెంటుకు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాయకులు , మంత్రులు ఏం చేసినా ము హూర్తాలు చూసుకుంటారు. అలానే.. ఎన్నికల సమయంలో అయితే.. మరింత ఎక్కువగా ముహూర్తాలు, వర్జ్యాలు కూడా చూసుకుని నామినేషన్ వేస్తుంటారు. అయినప్పటికీ గెలిచే వారు గెలుస్తారు.. ఓడే వారు ఓడుతున్నారు. కానీ, సెంటిమెంటు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇక, తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్‌లో మరో సెంటిమెంటు కూడా ఉంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని భావించేవారు.. సెంటిమెంటును తలుచుకుని.. పదే పదే వగ రుస్తున్నారు. ఇప్పటి వరకు 4 సార్లుగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీష్‌కుమార్‌ను పోల్చుకుని.. ఈ సెంటిమెంటును ఫాలో అవుతున్నారు. అసెంబ్లీ నుంచి ఎన్నికైన వారికి సీఎం సీటు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవిల తర్వాత.. ఈ సీటును దక్కించుకున్ననాయకుడు నితీష్‌కుమార్.
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలు.. అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత.. ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కారు. కానీ, వీరు ఎక్కువ కాలం ఆ పీఠంపైకూర్చోలేక పోయారు. ఏదో ఒక అవాంతరం.. కేసులు వెంటాడాయి. మధ్యలో వారు పదవులు కోల్పోయారు. రబ్రీ దేవి గరిష్ఠంగా ఏడాదిన్నర పాటు మాత్రమే అధికారంలో ఉండగా.. లాలూ ప్రసాద్ యాదవ్.. కేవలం రెండేళ్ల 18 రోజులు ఒకసారి, మూడేళ్ల 112 రోజులు మరోసారి సీఎం సీటులో ఉన్నారు. దీంతో నేరుగా గెలిచి ముఖ్యమంత్రి అయిన వారిని కేసులు వెంటాడుతున్నాయన్న వాదన ఉంది.
ఇక, ప్రస్తుత సీఎం నితీష్‌కుమార్ మాత్రం అసెంబ్లీ నుంచి కాకుండా.. శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈయన మాత్రం.. 10 సంవత్సరాల 300 రోజుల పాటు ఈ సీటును కరిచిపెట్టుకుని కూర్చున్నారు. ఈయనకు ముందు పనిచేసిన జితిన్‌రాం మాంఝీ కూడా.. మండలి నుంచి ఎన్నికయ్యా రు. ఆయన కూడా సుమారు ఏడాదిపాటు పదవిలో ఉన్నారు. దీంతో అసెంబ్లీ నుంచి ఎన్నికైన వారికి ముఖ్యమంత్రి పీఠం కలిసి వస్తుందా? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
