కమలం చలువతోనే నితీష్ కి పదవులు
బీహార్ సీఎం నితీష్ కుమార్ ది దాదాపుగా యాభై ఏళ్ళ రాజకీయ జీవితం. ఆయన తొలిసారి 1977లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
By: Satya P | 21 Nov 2025 12:25 PM ISTబీహార్ సీఎం నితీష్ కుమార్ ది దాదాపుగా యాభై ఏళ్ళ రాజకీయ జీవితం. ఆయన తొలిసారి 1977లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే రాజకీయ యుద్ధం చేశారు. చివరికి 1985లో ఆయన తొలిసారి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 1989 నుంచి ఆయన దశ తిరిగింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్రంలో తొలిసారి ఆయన సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనతాదళ్ చీలిపోయాక లాలూ యాదవ్ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టి ఎన్డీయేతో జట్టు కట్టాకనే ఆయన రాజకీయం పూర్తిగా పండింది.
వాజ్ పేయి కి ఇష్టుడిగా :
బీజేపీ దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్ పేయి కి నితీష్ కుమార్ ఇష్టుడిగా పేరు తెచ్చుకున్నారు. అందువల్లనే ఆయనకు కీలకమైన రైల్వే, వ్యవసాయ శాఖలు లభించాయి. బీహార్ సీఎం కుర్చీలో తొలిసారి నితీష్ ని కూర్చోబెట్టింది కూడా వాజ్ పేయి ప్రధానిగా ఉండగానే జరిగింది. అయితే సంఖ్యాబలం చాలకపోవడంతో 2000లో కేవలం ఏడు రోజుల పాటే అధికారంలో నితీష్ కొనసాగారు. 2005లో నితీష్ కి ముఖ్యమంత్రి దక్కింది కూడా వాజ్ పేయి ప్రచారంతో పాటు బీజేపీ మద్దతు వల్లనే అన్నది అందరికీ తెలిసిందే. అలా కమల బంధంతో వరసగా రెండు ఎన్నికలు గెలిచి తొమ్మిన్నర ఏళ్ళ పాటు బీహార్ సీఎం గా పనిచేసిన నితీష్ కుమార్ మోడీతో విభేదించి ఎన్ డీయే నుంచి తప్పుకున్నారు.
లాలూతో పొసగని తీరు :
బీహార్ రాజకీయాల్లో ఒకేసారి లాలూ యాదవ్ నితీష్ కుమార్ కలిసి ఎదిగారు, మంచి మిత్రులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. లాలూ సీఎం కావడానికి నితీష్ ఎంతో సాయం చేశారు. అయితే లాలూ నితీష్ జనతా పార్టీ జనతాదళ్ లలో కొనసాగినా కూడా నితీష్ పార్టీ జేడీయూ లాలూ పార్టీ ఆర్జేడీ ల మధ్య మాత్రం ఏ కోశానా సఖ్యత అన్నదే లేదు, మధ్యేవాద పార్టీలు సహజంగా కలవాలి. కానీ అది బీహార్ లో జరగలేదు. అందుకే 2015లో ఆర్జేడీతో కలసి నితీష్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా కూడా రెండేళ్ళ కంటే ఈ బంధం నిలబడలేదు, తిరిగి 2017లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే గూటికే నితీష్ చేరుకుని 2020లో మరోసారి పోటీ చేసి సీఎం అయ్యారు. ఇక 2022 ఆగస్టులో మరోమారు ఆర్జేడీతో కలిసినా 2024 జనవరి నాటికి ఆ బంధం బీటలు వారింది. అలా మళ్ళీ ఎన్డీయే నీడకే నితీష్ చేరారు. దాని ఫలితాలు కూడా ఆయన పార్టీ చవి చూసింది.
బీజేపీతోనే పదవులు :
బీజేపీతో కలసినపుడే నితీష్ కు పదవులు దక్కాయి అన్నది నిజం. ఆయన రాజకీయ ఎదుగుదల మొత్తం కమలం చలువతోనే సాగింది అన్నది కూడా వాస్తవం అంటారు. భావసారూప్యత కూడా బీజేపీ జేడీయూల మధ్యనే ఎక్కువగా కనిపిస్తోంది అని చెబుతారు. నిజానికి జేడీయూ సెక్యులర్ పార్టీగా ఉన్నా నితీష్ నిరాడంబరత, నిజాయతీ బీజేపీ మాట తప్పని నైజం, ఉన్నత స్థాయి రాజకీయం ఇవన్నీ కలసి వచ్చాయి. ఇక బీహార్ జనాలు కూడా ఈ రెండు పార్టీలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. విన్నింగ్ కాంబినేషన్ గా చూస్తున్నారు. ఇక మోడీ కేంద్రంలో భారీ ఇమేజ్ తో ఉంటే నితీష్ బీహార్ లో అంతే ఇమేజ్ తో కొనసాగుతున్నారు అందుకే ఈ ఇద్దరు దిగ్గజ నేతల వైపే బీహార్ లో ఏడున్నర కోట్ల మంది ఓటర్లు తాజా ఎన్నికల్లో మరోసారి ఓటెత్తి జై కొట్టారు. మొత్తానికి తేలేది ఏమిటి అంటే బీజేపీతో కలసి ఉంటేనే నితీష్ కి కుర్చీ లేకుంటే మాజీ అన్నదే.
