Begin typing your search above and press return to search.

నితిన్ నబిన్ తొలి అడుగు తెలంగాణతోనే !

ఇటీవలనే బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితుడు అయిన వారు నితిన్ నబిన్ ఆయన బీహార్ కి చెందిన కీలక సామాజిక వర్గం నేత.

By:  Satya P   |   29 Jan 2026 7:00 AM IST
నితిన్ నబిన్ తొలి అడుగు తెలంగాణతోనే !
X

ఇటీవలనే బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితుడు అయిన వారు నితిన్ నబిన్ ఆయన బీహార్ కి చెందిన కీలక సామాజిక వర్గం నేత. అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నితిన్ నబిన్ ని కేంద్ర బీజేపీ పెద్దలు ఏరి కోరి జాతీయ అధ్యక్షుడిని చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు అధ్యక్ష పదవి అన్నది అధికార దర్పంతో కూడుకుని ఉంటుంది. ఇంతటి ముఖ్యమైన స్థానం నితిన్ నబీన్ కి దక్కింది అంటే ఆయన మీద అంతే భారం కూడా ఉందని అర్ధం చేసుకోవాలి. ఈ ఏడాది వరసబెట్టి దేశంలో అనేక అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది ఉన్నాయి. ఆ తరువాత 2028లో సైతం ఎక్కువగానే అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 2029లో చూస్తే ఏకంగా లోక్ సభకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. దాంతో నితిన్ నబిన్ కి క్షణం తీరిక లేదని భావించాల్సి ఉంటుంది.

మొదటి వ్యూహం అక్కడే :

ఇదిలా ఉంటే గత వారం జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ నబిన్ ఢిల్లీ నుంచి తొలి అడుగు నేరుగా కీలక రాష్ట్రంలోనే పెట్టబోతున్నారు. ఆయన తెలంగాణా పర్యటనకు వస్తున్నారు. తెలంగాణాకు ఈ సమయంలో ఎందుకు రావడం అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. షెడ్యూల్ కూడా వెలువడింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. దాంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుంది. దాంతో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడినినే ప్రచారానికి ముందు పెట్టి మరీ సమరానికి తెర తీస్తోంది.

అర్బన్ లో బలం :

బీజేపీకి పట్టణ ప్రాంతాలలో బలం ఉంది. దాంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మునిసిపాలిటీలను గెలుచుకోవాలని చూస్తోంది. దాని కోసం జాతీయ నేతలనే రప్పిస్తోంది. ఇదే వరసలో నితిన్ నబీన్ రాబోతున్నారు. ఆయన ఫిబ్రవరి 2,3 తేదీలలో ప్రచారానికి వస్తున్నారు. దాంతో నితిన్ నబిన్ తెలంగాణా గడ్డ మీద నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రత్యర్ధుల మీద చేసే శర సంధానం ఎలా ఉండబోతుందో అంతా చూడబోతున్నారు. అంతే కాదు నితిన్ నబిన్ మాటకారి తనం, ఆయన ప్రసంగం శైలి, ఆయన విమర్శల ధాటి, ఆయన ఉపన్యాసం లోని తీవ్రత అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియబోతున్నాయి. అంతే కాదు తెలంగాణాలో బీజేపీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోంది అని బీజేపీ నేతలు ఆశలు పెంచుకున్నారు. మరి ఈ ఆశలను నితిన్ నబిన్ ఏ మేరకు పెంచుతారు, వారికి ఏ రకమైన దిశా నిర్దేశం చేస్తారు అన్నది కూడా తేట తెల్లం కాబోతోంది అని అంటున్నారు. ఇక నితిన్ నబిన్ మహబూబ్ నగర్ లో తన ఎన్నికల ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

వారు సైతం :

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారని అంటున్నారు. ఆయన కూడా రెండు రోజుల పాటు తెలంగాణాలో పర్యటిస్తారు. అమిత్ షా నిర్మల్ సభలో ప్రసంగం చేస్తారు. అలాగే మరో ఎన్నికల సభ ఉత్తర తెలంగాణాలో ఇంకో సభ దక్షిణ తెలంగాణాలో అమిత్ షాతో పెట్టించాలని బీజేపీ తెలంగాణా నేతలు ఆలోచిస్తున్నారు. అదే విధంగా మరికొందరు బీజేపీ జాతీయ నేతలు కూడా ఈ ప్రచారానికి రాబోతున్నారు. మొత్తం మీద చూస్తే తొలిసారి తెలంగాణాకు రాబోతున్న నితిన్ నబిన్ మీదనే అందరి ఫోకస్ ఉందని అంటున్నారు.