స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్.. కొత్త నిబంధనలు ఇవే!
నిబంధనల ఉల్లంఘనలు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారుల అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా.... రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.
By: Raja Ch | 9 Jan 2026 2:00 PM ISTఇటీవల కాలంలో సంస్థల యజమానుల నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో, మద్యం మత్తు ప్రభావమో.. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న సంగతి తెలిసిందే! గత ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ క్రమంలో గత ఏడాది చివరి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రమాదాలు ఎన్నో జరగ్గా.. వాటి కారణంగా 140 నుంచి 150 మంది వరకూ మృత్యువాత పడిన పరిస్థితి! ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్లీపర్ బస్సుల విషయంలో పలు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగా... కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు, తయారీ సంస్థలకు మాత్రమే స్లీపర్ బస్సులు నిర్మించేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
నిబంధనల ఉల్లంఘనలు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారుల అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా.... రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ చర్యలు తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం, ఇష్టానుసారం బస్సులను ఆల్ట్రేషన్ చేయించి నడపడం, అగ్నిప్రమాదం జరిగితే నియంత్రించే పరికరాలు లేకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు పేర్కొంటుండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే క్రమంలో... ప్రస్తుతం ఉన్న అన్ని స్లీపర్ బస్సులలో అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలు, ప్రతి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తి, ఎమర్జెన్సీ లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి ఆదేశించారు. అదేవిధంగా... మండే స్వభావం గల వస్తువులను తరలించడానికి అనుమతి లేదని.. అలాంటి వస్తువులు తరలించిన బస్సు యజమానులపై తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ప్రైవేటు స్లీపర్ బస్సుల ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
వెహికల్-టు-వెహికల్ కమ్యునికేషన్ టెక్నాలజీ!:
ఈ సందర్భంగా.. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో ఉచిత స్పెక్ట్రమ్ ను ఉపయోగించి వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పిన కేంద్రమంత్రి... కార్ల వేగం, స్థానం మొదలైన వాటి గురించి రియల్ టైం డేటాను ఇతర వాహనాలతో పంచుకోవడానికి ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుందని.. ఇదే సమయంలో.. వాహనాల ముందున్న ట్రాఫిక్, బ్లైండ్ స్పాట్ ల విషయంలో డ్రైవర్లను హెచ్చరిస్తుందని.. ఫలితంగా ప్రమాదాలు తగ్గే అవకాశముందని వెల్లడించారు.
