Begin typing your search above and press return to search.

ప్రధాని కావలసిన గడ్కరీ...ఎందుకిలా వైరాగ్యం?

ఆర్ఎస్ఎస్ కి ఎంతో ఇష్టుడు, సంఘీయుడుగా ముద్రపడిన వారు, బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారు.

By:  Satya P   |   26 Aug 2026 9:15 AM IST
ప్రధాని కావలసిన గడ్కరీ...ఎందుకిలా వైరాగ్యం?
X

ఆర్ఎస్ఎస్ కి ఎంతో ఇష్టుడు, సంఘీయుడుగా ముద్రపడిన వారు, బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారు. ఆయనే నితిన్ గడ్కరీ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో గత పన్నెండేళ్ళుగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మరో మూడేళ్ళు పూర్తి అయితే పదిహేనేళ్ళ కేంద్ర మంత్రిగా కంటిన్యూగా పనిచేసిన రికార్డు సృష్టిస్తారు. అంతే కాదు రోడ్డు రవాణా రహదారుల శాఖకు అత్యధిక కాలం పనిచేసిన మంత్రిగా కూడా నితిన్ గడ్కరీకి మరో రికార్డు ఉంది. నిజాయితీ నిబద్ధత ఏ శాఖ అప్పగించినా అంకిత భావం ఇవన్నీ నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా నిలిపాయి. అంతే కాదు ఆయన సంఘీయుడు అయినా కరడు కట్టిన తీరు కాదు, ఉదారవాదిగా ఆయన అందరి మన్ననలు అందుకున్నారు. ప్రతిపక్షానికి సైతం ఆయన రాజకీయ శైలి నచ్చుతోంది అంటే నితిన్ గడ్కరీ రాజకీయం ఎంత నేర్పుగా ఓర్పుగా సాగుతోందో వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు.

నాగ్ పూర్ కి దగ్గరగా :

ఇక నితిన్ గడ్కరీ నాగ్ పూర్ నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఘన విజయాలు నమోదు చేశారు. నాగ్ పూర్ అన్నది ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్ర కార్యాలం అన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 2009 నుంచి 2013 దాకా నాలుగేళ్ళ పాటు పనిచేయడం వెనక ఆర్ఎస్ఎస్ అండ ఉంది అని అంటారు. ఇక ఆయనకు ఎప్పటికైనా ప్రధానిగా చూడాలన్న ఆశ కూడా సంఘీయులలో ఉందని కూడా చెబుతారు. దానికి తగినట్లుగా గతంలో పలు సందర్భాలలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి విధితమే.

మోడీకి ప్రత్యామ్నాయంగా :

నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీని తీసుకుని రావాలని ఒక ప్రయత్నం జరిగింది అని కూడా అంటారు. దీని వెనక సంఘీయుల ప్రోత్సాహం ఉందని చెబుతారు. ఇక గడ్కరీ అయితే అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటారు అన్న భావన ఉంది. పార్టీ ఫస్ట్ అన్నది ఆయన విధానంగా చెబుతారు. 75 ఏళ్ళకే ఉన్నత పదవుల నుంచి తప్పుకోవాలన్న బీజేపీ నిబంధనల మేరకు మోడీ తప్పుకుంటారు అని ఒక దశలో ప్రచారం సాగినపుడు గడ్కరీయే కొత్త ప్రధాని అని కూడా ప్రచారం సాగింది. అయితే అది జరగని పని అని తేలిపోయింది.

మంత్రి వర్గ విస్తరణ వేళ :

ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటించారు. తనకు వయసు అయిపోతోంది అని కొత్త తరం రావాలని ఆయన ప్రకటించి సంచలనం రేపారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ ట్రస్ట్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తాను దాదాపు 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని తెలిపారు. మునుపటిలా ఇప్పుడు అంతగా పని చేయలేకపోతున్నానని చెప్పారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలని, వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. అంతే కాదు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యేకంగా అంతా చూస్తున్నారు. అంతా జెన్ జీ యూత్ గురించి మాట్లాడుకుంటున్న వేళ కేంద్ర మంత్రి వర్గంలో యువతకు పెద్ద పీట వేస్తారు అని వార్తలు వస్తున్నాయి. దాంతో నితిన్ ప్రకటనకు ముడిపెట్టి మరీ రాజకీయ మసాలాను జోడిస్తున్నారు.

గడ్కరీ కార్యాలయం స్పష్టత

అయితే నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాలకు సంబంధించినవి కాదని ఆయన కార్యాలయం వెంటనే స్పష్టం చేసింది. లక్ష్మణ్‌రావు మంకర్ ట్రస్ట్ నిర్వహణ దాని భవిష్యత్ నాయకత్వం గురించే ఆయన ఆ మాటలు చెప్పారని పేర్కొంది. అంతే తప్ప ఆయన ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని మీడియాలో ప్రసారం చేస్తున్నారని గడ్కరీ ఆఫీసు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివరణ ఇచ్చినా కూడా గడ్కరీ రాజకీయ వైరాగ్యం గురించిన చర్చ మాత్రం ఆగడం లేదు. ప్రధాని కావాల్సిన ఆయన ఇంతలా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏది ఏమైనా నితిన్ గడ్కరీ స్టేట్ మెంట్ అయితే బీజేపీ లోపలా బయటా కూడా చర్చకు తావిస్తోంది.