కరోనా తర్వాత మారిన ‘గడ్కరీ’ కథ
అయితే కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జీవితంలో మాత్రం ఈ కాలం ఒక ఆరోగ్యకరమైన విప్లవాన్నే తీసుకొచ్చింది.
By: A.N.Kumar | 13 Aug 2026 1:00 AM ISTకరోనా మహమ్మారి మానవాళికి ఎన్నో చేదు అనుభవాలను.. మరికొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలను మిగిల్చింది. అయితే కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జీవితంలో మాత్రం ఈ కాలం ఒక ఆరోగ్యకరమైన విప్లవాన్నే తీసుకొచ్చింది. నిరంతరం బిజీగా ఉండే రాజకీయ షెడ్యూల్స్, విపరీతమైన పని ఒత్తిడి మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రతి ఒక్కరికీ ఆయన జీవనశైలిలో వచ్చిన మార్పు ఒక గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సమయంలో మహమ్మారి తీవ్రతను, స్నేహితుల వియోగాన్ని ప్రత్యక్షంగా చూసిన గడ్కరీ.. ఆరోగ్యం ఎంత విలువైందో గ్రహించి ఏకంగా 46 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.
135 నుంచి 89 కేజీలకు.. స్ఫూర్తిదాయక వెయిట్ లాస్ జర్నీ
గతంలో నితిన్ గడ్కరీ బరువు 135 కిలోలు. నిర్దిష్టమైన ఆహార నియమాలు, వ్యాయామ ప్రణాళిక లేకపోవడంతో బరువు పెరిగిపోతూ వచ్చారు. అయితే కరోనా తర్వాత తన జీవనశైలిని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్న ఆయన క్రమశిక్షణతో కూడిన పద్ధతులను పాటించి తన బరువును 89 కిలోలకు తగ్గించుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య ప్రయాణం గురించి మాట్లాడిన ఆయన “మనం వ్యక్తిగత జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండటం అత్యంత ముఖ్యం” అని స్పష్టం చేశారు.
నితిన్ గడ్కరీ ఫిట్‌నెస్ సూత్రాలు
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే నిద్రలేవడం ఆయన మొదటి అలవాటుగా మార్చుకున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కనీసం రెండున్నర గంటల పాటు నిరంతరాయంగా వ్యాయామం చేస్తారు. వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గేందుకు చేసే ఒక తాత్కాలిక ప్రక్రియగా కాకుండా దాన్ని తన దినచర్యలో తప్పనిసరి భాగంగా మార్చుకున్నారు. జంక్ ఫుడ్, అస్తవ్యస్తమైన తిండి వేళలను పక్కనబెట్టి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు.“ఆరోగ్యమే నిజమైన సంపద. శారీరక దృఢత్వం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలం.” అని నితిన్ గడ్కరీ తెలిపారు.
నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలు
ప్రస్తుత ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది పని ఒత్తిడి, సమయం లేకపోవడం, బద్ధకం వంటి కారణాలు చెబుతూ ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ, దేశవ్యాప్తంగా వందల కొద్దీ కార్యక్రమాల్లో పాల్గొనే ఒక నాయకుడు తన ఆరోగ్యం కోసం రోజుకు రెండున్నర గంటలు కేటాయిస్తున్నారంటే.. అది సామాన్యులకు ఒక పెద్ద హెచ్చరిక. అదే సమయంలో గొప్ప స్ఫూర్తి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. సరైన ఆహార నియమాలు పాటించడం, ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం.. జీవనశైలిలో చిన్న చిన్న అనుకూల మార్పులు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని నితిన్ గడ్కరీ తన అనుభవంతో నిరూపించారు.
