Begin typing your search above and press return to search.

మోడీకి సెగ పెడుతున్న‌ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, మ‌హారాష్ట్ర‌కు చెందిన నాయ‌కుడు నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఇంకా మ‌న‌మేనా? యువ‌త‌కు అవ‌కాశం ఎప్పుడు ఇవ్వాలి?.

By:  Garuda Media   |   25 Aug 2026 11:00 PM IST
మోడీకి సెగ పెడుతున్న‌ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

కేంద్ర మంత్రి, మ‌హారాష్ట్ర‌కు చెందిన నాయ‌కుడు నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఇంకా మ‌న‌మేనా? యువ‌త‌కు అవ‌కాశం ఎప్పుడు ఇవ్వాలి?. ఏళ్ల త‌ర‌బ‌డి పాతుకుపోతామంటే యువ‌త‌కు న‌చ్చుతుందా?`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. బీజేపీ వ‌ర్గాల్లోనే కాదు.. కీల‌క‌మైన ఆర్ ఎస్ ఎస్ లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

నిజానికి ఆయ‌న త‌న గురించే వ్యాఖ్య‌లు చేస్తున్నాన‌ని చెబుతూ.. యూనివ‌ర్స‌ల్‌గా చేసిన కామెంట్లు ప‌రోక్షంగా పెద్ద స్థానాల్లో ఉన్న‌వారిని ఉద్దేశించిన‌వేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాను 30 ఏళ్ల‌కుపైగానే రాజ‌కీయ ప‌ద‌వుల్లో ఉన్నాన‌ని.. ఇంకా వీటిని ప‌ట్టుకుని వేలాడితే.. నేటి త‌రానికి అవ‌కాశం ఎవరు ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను ఈ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొనే స‌మయం వ‌చ్చేసింద‌న్నారు. అదే స‌మ‌యంలో ఈ బాధ్య‌త‌ల‌ను యువ‌త‌కు అప్ప‌గించాల‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు.

బీజేపీలోనూ.. కేంద్ర మంత్రివ‌ర్గంలోనూ తాను ప‌నిచేశాన‌ని.. ఇక‌పై గిరిజ‌న ప్రాంతాలు, రైతులు, గ్రామాల కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. ఇదేస‌మ‌యంలో యువ‌త కోసం దారి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. అయితే.. గ‌డ్క‌రీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీలో కీల‌క చ‌ర్చ‌కు దారితీశాయి. ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ 2029లోనూ కొన‌సాగాలంటూ.. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వ్యాఖ్యానించారు.

అలాగే.. మ‌రికొంద‌రు మంత్రులు కూడా కొన‌సాగాల‌ని ఫ‌డ్న‌వీస్ కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గ‌డ్క‌రీ చేసిన వ్యాఖ్య‌లు.. ప‌రోక్షంగా ప్ర‌ధాని ప‌ద‌వి గురించే అయి ఉంటుంద‌న్న చ‌ర్చ తెర‌ మీదికి వ‌చ్చింది. మోడీ ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధానిగా ఇప్ప‌టికి 27 సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యం లో మ‌రోసారి ఆయ‌నే ప్ర‌ధాని కావాలంటూ.. కొందరు చెప్ప‌డం.. బీజేపీలో సంస్థాగ‌తంగా ఉన్న గ‌డ్క‌రీ వంటివారికి న‌చ్చ‌డం లేదు. దీంతో ఆయ‌న ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌లు చేశారా? అనే కోణంలోనూ విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే.. బీజేపీ కానీ, ఆర్ ఎస్ ఎస్ కానీ.. గ‌డ్క‌రీ వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌లేదు.