తెలంగాణ, ఆంధ్రాకు నితిన్ గడ్కరీ ఉమ్మడి గుడ్ న్యూస్..!
అవును... మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని రూ.5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
By: Raja Ch | 2 Aug 2025 11:42 PM ISTఅటు ఏపీలోనూ, ఇటు కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో ప్రధానంగా ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి! ఈ క్రమంలో తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా.. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించనున్నట్లు తెలిపారు.
అవును... మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని రూ.5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. దేశ ప్రగతిలో నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తాయని.. ఏపీ అభివృద్ధిలో నౌకాయాన శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా... హైదరాబాద్ - విజయవాడ మధ్య కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించనున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే కేవలం 2 గంటల్లోనే విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత హైవేను 6 లేన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వేగంగా దూసుకుపోతోందని.. మంచి నాయకుడు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గడ్కరీ... చంద్రబాబు విజన్ గురించి ఎప్పుడూ వినేవాళ్లమని.. ఆయన లాంటి నాయకుడు అరుదుగా ఉంటారని.. ఆయన ఎప్పుడూ భవిష్యత్ గురించే ఆలోచిస్తారని అన్నారు.
ఇదే సమయంలో... ప్రతీ సంవత్సరం వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని చెప్పిన నితిన్ గడ్కరీ... మనదేశంలో నీటి కొరత సమస్య లేదని.. కాకపోతే నీటి నిర్వహణే పెద్ద సమస్యగా మారిందని.. అందుకే రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయని తెలిపారు. మనదేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 12 నుంచి 22 శాతానికి పెరగాలనేది లక్ష్యమని అన్నారు.
ఇక... ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని.. కొద్దికాలంలోనే జపాన్ ను అధిగమించామని చెప్పిన గడ్కరీ... ప్రధాని మోడీ హయాంలో మన రైతులు విద్యుత్ తయారు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో విమానాలు కూడా రైతులు తయారు చేసే ఇంధనంతోనే నడుస్తాయని వెల్లడించారు.
