నిర్మలమ్మ చేతిలో 'రెడ్ ఫైల్' ప్రత్యేకత గురించి తెలుసా..!
వాస్తవానికి బడ్జెట్ - ఎరుపు రంగు కవర్ / సంచి మధ్య సంబంధం బ్రిటిష్ పార్లమెంటరీ పద్ధతిలో ఉద్భవించింది.
By: Raja Ch | 1 Feb 2026 9:53 AM ISTప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడల్ల "రెడ్ ఫైల్" ఒకటి ప్రత్యేకంగా కనిపిస్తుందన్న సంగతి తెలిసిందే. గతంలో కనిపించే బడ్జెట్ సూట్ కేసుల స్థానంలో 2019 నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెడ్ ఫైల్ ను తెరపైకి తెచ్చారు. ఆమె తన మొదటి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు.. ఈ ప్రత్యేక మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కేవలం రంగు, వస్తువు మార్పు మాత్రమే కాదు.. దీని వెనుక చాలా కథే ఉంది!
అవును... రికార్డు స్థాయిలో నిర్మాలా సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం. ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు.. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. వారు వరుసగా చేయలేదు.. వేర్వేరు సమయాల్లో అందించారు. ఈ క్రమంలో... 2019 మే 31న ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె బడ్జెట్ ప్రతులను రెడ్ ఫైల్ లో తీసుకొస్తున్నారు.
2021లో కేంద్ర బడ్జెట్ ను పేపర్ లెస్ గా మార్చిన తర్వాత కూడా.. ఆర్థిక మంత్రి డిజిటల్ ట్యాబ్ కోసం కూడా ఈ రెడ్ పౌచ్ ను వదలలేదు! అయితే ఇది కేవలం రంగుకు ప్రాధాన్యతో, సూట్ కేస్ స్థానంలో ఫైల్స్ తరహా స్టైలుకు ప్రాముఖ్యతో కాదు... ఇది సాంస్కృతిక గుర్తింపు, వలస సంప్రదాయల నుండి స్వదేశీ పాలన వ్యక్తీకరణలకు భారతదేశపు ప్రయాణానికి సూచనగా చెబుతున్నారు. దీనిపై గతంలో స్పందించిన నిర్మలమ్మ... బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి దూరంగా ఈ నిర్ణయం అని అన్నారు!
వాస్తవానికి బడ్జెట్ - ఎరుపు రంగు కవర్ / సంచి మధ్య సంబంధం బ్రిటిష్ పార్లమెంటరీ పద్ధతిలో ఉద్భవించింది. యూకేలో అధికారిక ఆర్థిక పత్రాలు సంప్రదాయకంగా ఎరుపు రంగు తోలు సంచులలో ఉంచుతారు. అయితే.. స్వాయంత్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల పాటు భారత బడ్జెట్ ప్రతులను ఎరుపు రంగు బ్రీఫ్ కేసులలోనే తీసుకొచ్చేవారు.. బ్రిటిష్ వారసత్వాన్ని దాదాపు కొనసాగించారు! కాగా.. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం ‘బౌగెట్’ నుంచి రాగా.. దీని అర్ధం చిన్న తోలు సంచి!
అయితే. 2019 తర్వాత ఈ పద్దతి మారిపోయింది. ఇందులో భాగంగా... ఆ ఏడాది నిర్మలా సీతారామన్ తన మొదటి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బ్రీఫ్ కేసుకు బదులుగా ఈ ఎరుపు రంగు ఫైల్ ను ప్రవేశపెట్టారు. భారతీయ వ్యాపారులు సంప్రదాయకంగా ఖాతాలను నిర్వహించడానికి వస్త్రంతో కట్టబడిన లెడ్జర్ కు ప్రతీకగా ఆమె ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అంటారు! ఇది వలస ఆచారాల నుంచి దూరంగా.. భారతీయ సాంస్కృతిక మూలాలను స్వీకరించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని అంటారు.
ఇదే సమయంలో.. బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే క్షణం.. చాలా మంది పౌరులకు ఈ సుపరిచితమైన రంగు.. విశ్వాసాన్ని కలిగిసుందని.. ఆర్థిక నిర్ణయాలను సాంస్కృతిక విలువలతో అనుసంధానిస్తుందని చెబుతారు. నిర్మలమ్మ చేతిలోని రెడ్ ఫైల్ వెనుక ఇంత కథ ఉందన్నమాట!
