నిర్మలా సీతారామన్.. ఇక, 'భారత లక్ష్మి'
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నాయకురాలు.
By: Garuda Media | 12 Aug 2025 1:00 AM ISTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నాయకురాలు. నేరుగా పార్లమెంటుకు ఒక్కసారి కూడా ఎన్నిక కాకపోయినా.. రాజ్య సభ ద్వారా ఆమె కేంద్రంలో ఆర్థిక మంత్రిగా కీలక రోల్ పోషిస్తున్నారు. ముఖ్యంగా `జీఎస్టీ` వ్యవహారంలో ఆమెపై దేశవ్యాప్తంగా వచ్చినన్ని మీమ్స్, కామెంట్లు ఇతర ఏ కేంద్ర మంత్రిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. పలక, బలపం, పెన్సిల్, ఎరేజర్.. సహా పాప్ కార్న్‌పై ఆమె విధించిన జీఎస్టీలు.. ఏళ్ల తరబడి సోషల్ మీడియాలో కామెంట్లకు కారణమయ్యాయి. ఇక, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వరుసగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మహిళా నాయకురాలిగా కూడా నిర్మలా సీతారామన్ పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ఆమెకు కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణమఠం వారు.. `భారత లక్ష్మి` బిరుదుతో సత్కరించారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ బిరుదుకు ఆమెను ఎంపిక చేసినట్టు శ్రీకృష్ణమఠం పేర్కొంది. ఈ నెల 16న కృష్ణజన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. అయితే.. దీనికి ఓ వారం ముందుగానే.. ఉడిపిలో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ కార్యక్రమాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ కో చైర్మన్ సతీమణి సుధా మూర్తి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నిర్మలా సీతారామన్.. ఓ సాధారణ భక్తురాలిగా మారిపోయారు.
కృష్ణమఠంలోని పరిసరాలను చీపురు పట్టుకుని శుభ్రం చేశారు. అదేవిధంగా `అన్నబ్రహ్మ`.. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో వంట పాత్రలను శుభ్రం చేశారు. అదేవిధంగా కూరగాయలు కూడా తరిగారు. దేవునికి పూల మాలలు కూడా కట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో మధురానుభూతిని మిగిల్చిందని కేంద్ర మంత్రి చెప్పారు. అనంతరం.. రెండుకిలోల బంగారంతో తయారు చేయించిన `మహా కవ్వాన్ని`(వెన్న తీసేందుకు ఉపయోగిస్తారు) నిర్మలాసీతారామన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి మత్రి ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత దేశాన్ని ఆర్థిక రంగంలో తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు.
లక్ష్మికి ఇవ్వడమే తెలుసు!
ఇదిలావుంటే.. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు `భారత లక్ష్మి` పురస్కారం అందించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు కురిశాయి.``లక్ష్మికి ఇవ్వడమే తెలుసు.. తీసుకోవడం తెలియదు. కానీ.. `భారత లక్ష్మి`కి తీసుకోవడమే తెలుసు` అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. దీనికి భారీ సంఖ్యలో లైకులు పడ్డాయి. మరొకరు.. `భారత లక్ష్మి పన్నులు తగ్గించాలి`` అని కోరారు. `భారత లక్ష్మి.. పెట్రోల్ ధరలు తగ్గించాలి`` అని ఇలా.. పలువురు వ్యాఖ్యానించారు.
