నిమ్స్ డాక్టర్ రూ.80 కోట్ల ఆస్తుల ప్రచారంలో అసలు నిజమెంత?
నిమ్స్.. తెలంగాణలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ. అలాంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Sept 2026 11:12 AM ISTనిమ్స్.. తెలంగాణలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ. అలాంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మి భాస్కర్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే ఈ సోదాల నేపథ్యంలో సోషల్ మీడియాలో.. కొన్ని ప్రచారాల్లో వినిపిస్తున్న ‘రూ.80 కోట్ల ఆస్తులు’ అనే సంఖ్యకు.. ఇప్పటివరకు ఏసీబీ వెల్లడించిన ప్రాథమిక అంచనాకు మధ్య గణనీయమైన తేడా కనిపిస్తోంది.
13 ప్రాంతాల్లో సోదాలు.. అసలు టార్గెట్ ఏంటి?
డాక్టర్ లక్ష్మి భాస్కర్ దాదాపు 20 ఏళ్లుగా నిమ్స్‌లో పనిచేస్తున్నారని.. గత ఐదేళ్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీకి సంబంధించిన నివేదికలు వెల్లడించాయి.
ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు.. భారీగా ఆస్తుల పత్రాలు
సోదాల్లో ఒక 4-బీహెచ్‌కే ఫ్లాట్, రెండు 3-బీహెచ్‌కే ఫ్లాట్లు, ఐదు 2-బీహెచ్‌కే ఫ్లాట్లు, ఐదు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కూకట్‌పల్లి, మణికొండ, పేట్‌బషీరాబాద్, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఈ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వీటిలో విశాఖపట్నంలో 800 చదరపు గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది.
బ్యాంకు ఖాతాల నుంచి బంగారం వరకు..
సోదాల్లో బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షలు, పోస్టాఫీస్ డిపాజిట్లలో రూ.12 లక్షలు, ప్రైవేట్ సంస్థల్లో రూ.35 లక్షల పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్లలో సుమారు రూ.29.55 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అదనంగా బంగారు ఆభరణాలు, మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా గుర్తించారు.
రూ.80 కోట్లు కాదు.. రూ.6.13 కోట్లుగా ఏసీబీ ప్రాథమిక అంచనా
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోదాల తర్వాత బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఏసీబీ ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువను సుమారు రూ.6.13 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక పత్రాల్లో చూపించిన విలువ కంటే గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అందువల్ల ‘రూ.80 కోట్ల ఆస్తులు’ అనే ప్రచారాన్ని ప్రస్తుతం నిర్ధారిత వాస్తవంగా చెప్పడం సాధ్యం కాదు. ఆస్తుల పూర్తి పరిశీలన, మార్కెట్ విలువ నిర్ధారణ, ఆదాయ వనరుల పరిశీలన పూర్తయ్యే వరకు తుది మొత్తం స్పష్టమయ్యే అవకాశం లేదు.
అప్పుల రూపంలోనూ భారీ మొత్తాలు?
సోదాల్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. డాక్టర్ లక్ష్మి భాస్కర్ వివిధ వ్యక్తులకు సుమారు రూ.1.33 కోట్లను అప్పుగా ఇచ్చినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. అలాగే వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలుకు సుమారు రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
మొత్తంగా చూస్తే.. నిమ్స్ వైద్యుడిపై నమోదైన కేసు ఇప్పుడు కేవలం సోదాలతో ముగిసిపోయే వ్యవహారం కాదు. గుర్తించిన ప్రతి ఆస్తికి ఆదాయ వనరు ఏమిటి? అవి చట్టబద్ధంగా సంపాదించినవేనా? మార్కెట్ విలువ ఎంత? ఆరోపణల్లో పేర్కొన్న అవినీతి ఆరోపణలకు వీటికి సంబంధం ఉందా? అనే అంశాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రూ.80 కోట్ల ఆస్తులు బయటపడ్డాయన్న ప్రచారానికి అధికారిక నిర్ధారణ లేదు.. ఏసీబీ ప్రాథమికంగా గుర్తించిన ఆస్తుల విలువ రూ.6.13 కోట్లుగా ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో అసలు ఆస్తుల లెక్క ఎంత అనేది స్పష్టమవుతుంది.
