నిమ్మల లాంటి వారే కావాలి బాబూ.. !
కానీ, దీనికి భిన్నంగా మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబంతో సహా కలిసి స్థానికంగా ఉన్న అనాధ పిల్లల పాఠశాలలో దీపావళి పండుగను చేసుకున్నారు.
By: Garuda Media | 22 Oct 2025 10:25 AM ISTదీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర పండగ చేసుకోవడం సహజం. రాజకీయ నాయకుల నుంచి సామాన్య పౌరుల వరకు ఇళ్ల దగ్గర లేదా కార్యాలయం దగ్గర ఈ పండుగను చేసుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబంతో సహా కలిసి స్థానికంగా ఉన్న అనాధ పిల్లల పాఠశాలలో దీపావళి పండుగను చేసుకున్నారు. నిజానికి ఇటీవల నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం జరిగింది. కొత్త అల్లుడు ఇంటికి వచ్చారు.
దీంతో దీపావళి పండుగ సందర్భంగా ఆయన ఇంట్లో ఘనంగా చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన సామాజిక స్పృహతో మానవీయ కోణంలో ఆలోచించి దీపావళి పండుగను ఒక అనాధాశ్రమంలో చిన్నారులు చదువుతున్న పాఠశాలలో కుటుంబంతో సహా కలిసి వచ్చిన నిర్వహించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది తమ ఇళ్లలోనే దీపావళి పండుగను జరుపుకున్నారు. కానీ వీరికి భిన్నంగా నిమ్మల రామానాయుడు మానవీయ కోణంలో ఆలోచించి పాలకొల్లులోని ఓ అనాధాశ్రమ పాఠశాలలో దీపావళిని నిర్వహించుకున్నారు.
పిల్లలకు మిఠాయిలు తినిపించారు. కొత్త బట్టలు కొనిచ్చారు. అదేవిధంగా దీపావళి బాణాసంచా కూడా వారికి అందించి మిఠాయిలు తినిపించి భోజనం కూడా పెట్టించారు. ఇలా సమాజానికి చేరువ అవుతున్న నాయకులుగా కొంతమంది నిలబడుతున్నారు. ఇలాంటి వారిని సీఎం చంద్రబాబు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి వల్ల పార్టీకి కూడా ప్రయోజనం చేకూరుతుంది. నాయకులను గుర్తించడమే కాదు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా పార్టీ ఉంటుంది.
ఇలాంటి వారిలో నిమ్మల రామానాయుడు సహా కొంతమంది నాయకులు ఉన్నారు. వీరిని పార్టీ గుర్తించాలి. మరింతగా ప్రోత్సహించాలి. రాబోయే తరానికి వీరిని ఉదాహరణగా చూపించి స్ఫూర్తిదాయకంగా వారిని మలిచే ప్రయత్నం చేయాలి. తద్వారా మంచి నాయకులను ఎంచుకునేటటువంటి అవకాశం పార్టీకి ఉంటుంది. అదే విధంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు కూడా మరోసారి పార్టీని గెలిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నిమ్మల రామానాయుడు లాంటి నాయకులను పార్టీ సహా ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
