నిమిష ప్రియ కేసు... అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదంటే ఇదేనా?
కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది.
By: Raja Ch | 3 Aug 2025 2:00 AM ISTయెమెన్ లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసు ఇప్పటికీ స్థబ్ధగా ఉన్నట్లు కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమెకు ఇప్పటికే ఉరి శిక్ష అమలైపోవాల్సినా... అదృష్టం కొద్దీ అది వాయిదా పడింది. ఈ సమయంలో ఆమె కోసం తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నానంటూ కేఏ పాల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి కేంద్రం రెడ్ సిగ్నల్ వేసింది.
అవును... కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ నిర్ణయంపై ఆందోళనలు మొదలైనట్లు చెబుతున్నారు!
ఈ సందర్భంగా స్పందిస్తూ... ఆమె కోసం తమ వంతు ప్రయత్నాలూ తాము చేస్తున్నామని.. మన పౌరుల భద్రతను తాము ప్రాధాన్యంగా పరిగణిస్తున్నామని.. అందువల్ల ఆ బృందం ప్రయాణానికి తాము అనుమతించలేమని స్పష్టం చేసింది. వాస్తవానికి.. నిమిష ప్రియను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది!
ఈ విషయంపై ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టుకు ఓ విషయం చెప్పింది. ఇందులో భాగంగా.. అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన విదేశాంగ శాఖ.. యెమెన్ కు మిత్రదేశాల ప్రభుత్వాలతో తాము టచ్ లో ఉన్నామని ప్రకటించింది! మరోవైపు ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలను ఖండిస్తుంది!
వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ.. నర్సు కోర్సు పూర్తి చేశారు. అనంతరం 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో.. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఈ సమయంలో... అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు.
దీనికి ఆ దేశ నిబంధనల ప్రకారం.. స్థానికుడైన తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష ప్రియ - థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొన్నారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేయగా... నిమిష మాత్రం యెమెన్ లోనే ఉంటూ ఆ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను కొనసాగించారు.
ఈ సమయంలో నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ మెహది వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు! ఈ క్రమంలో ఆమె పాస్ పోర్టు లాక్కొన్నాడు. దీంతో.. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు! ఈ క్రమంలో.. 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి తన పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది.
అయితే.. ఆ మత్తు మందు మోతాదు కాస్తా ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆమె మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పడేసింది. అనంతరం అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులోనే ఆమెకు మరణశిక్ష పడింది. ఈ ఏడాది జులై 16న మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. జులై 15న మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది.
అయితే, ప్రియను కాపాడేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలోనే.. తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
