భారత్ తో సంబంధాలు దెబ్బతీయకండి.. ట్రంప్ కు నిక్కీ హేలీ ఘాటు హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
By: A.N.Kumar | 6 Aug 2025 3:26 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. భారత్‌ను మిత్రదేశంగా కాకుండా అంతగా ఉపయోగపడని భాగస్వామిగా అభివర్ణిస్తూ ఆయన వాణిజ్య సుంకాలను గణనీయంగా పెంచుతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ స్పందిస్తూ ట్రంప్ విధానాలను పరోక్షంగా విమర్శించారు.
భారత్‌ను దూరం చేయొద్దు : నిక్కీ హేలీ
"భారత్ లాంటి బలమైన మిత్రదేశాన్ని అమెరికా తక్కువ చేయకూడదు. అటువంటి దేశంతో సంబంధాలను దెబ్బతీసుకుంటే అది అమెరికాకు ఒరిగేదేమీ ఉండదు," అని నిక్కీ హేలీ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
-చైనా, రష్యాలపై తీవ్ర విమర్శ
నిక్కీ హేలీ వ్యాఖ్యల్లో చైనా, రష్యాల వైఖరిపై కూడా అసంతృప్తి వ్యక్తమైంది. "భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు అని అంటున్నారు. కానీ అదే సమయంలో చైనా మాత్రం రష్యా నుంచి అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తోంది. అయినప్పటికీ చైనాకు మాత్రం ట్రంప్ పరిపాలన 90 రోజులు సుంకాల నుంచి మినహాయింపునిచ్చింది. ఇది ఎంతవరకు న్యాయమో?" అని ప్రశ్నించారు.
-ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు
ట్రంప్ తాజాగా భారత్ తమకు మంచి భాగస్వామి కాదని, రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు సుంకాలు పెంచుతానని వ్యాఖ్యానించారు. 25 శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధించాలన్న అతని ఆలోచనపై నిక్కీ హేలీ మండిపడ్డారు. ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలు అతను గతంలో వ్యక్తపరచిన భారత్ అనుకూల వైఖరికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.
-రష్యా మద్దతుగా భారత్
ట్రంప్ హెచ్చరికలపై రష్యా స్పందిస్తూ భారత్‌కు మద్దతు తెలిపింది. "స్వతంత్ర దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉంటుంది. తమ దేశ ప్రయోజనాల రీత్యా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలను మేము గౌరవిస్తాము" అని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.
-రాజకీయ అర్థాలు, భవిష్యత్ ప్రభావం
నిక్కీ హేలీ వ్యాఖ్యలు 2024 అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్‌కు మద్దతు తెలిపినప్పటికీ భారత్‌పై అతని తాజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ఓటర్ల ప్రభావం దృష్టిలో ఉంచుకుంటే, ఈ అంశం రిపబ్లికన్ పార్టీకి కీలకంగా మారే అవకాశముంది.
ఈ పరిణామాలు అమెరికా–భారత్ సంబంధాల దిశను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు భారత్ గ్లోబల్ ట్రేడ్‌లో తన పాత్రను విస్తరిస్తున్న తరుణంలో ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాల మీద పడే ప్రభావాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.
