Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మిత్రుడికి జైలు: ఐపీఎస్ సంజ‌య్ కు రిమాండ్.. ఎవ‌రు? ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అంటే ప్రాణం అని పేర్కొని వివాదానికి గురైన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి నిడిగ‌ట్టు సంజ‌య్‌కు విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

By:  Garuda Media   |   26 Aug 2025 4:30 PM IST
జ‌గ‌న్ మిత్రుడికి జైలు: ఐపీఎస్ సంజ‌య్ కు రిమాండ్.. ఎవ‌రు? ఏం జ‌రిగింది?
X

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అంటే ప్రాణం అని పేర్కొని వివాదానికి గురైన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి నిడిగ‌ట్టు సంజ‌య్‌కు విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వ‌చ్చే నెల 9వ తేదీ వ‌ర‌కు(14 రోజులు) రిమాండ్ విధిస్తున్న‌ట్టు ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పోలీసులు ఆయ‌న‌ను విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించ‌నున్నారు.

ఎవ‌రీయ‌న‌?

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సంజ‌య్‌.. ఏపీలో జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు.. సీఐడీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా, అదే స‌మ‌యంలో రాష్ట్ర అగ్నిమాప‌క శాఖ డీజీగా వ్య‌వ‌హ‌రించారు. ఈయ‌న హ‌యాంలోనే అప్ప‌టి ఎంపీ, ప్ర‌స్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై కేసు పెట్టారు. అప్ప‌టి సీఐడీ అధికారి సునీల్ ర‌ఘురామ‌ను చిత్ర‌హింస‌లకు గురిచేశార‌న్న కేసు కూడా న‌మోదైంది. ఇదిలావుంటే.. సంజ‌య్ పై.. నిధుల దుర్వినియోగం కేసు న‌మోదైంది. ఆయ‌న అగ్నిమాప‌క శాఖ డీజీగా వ్య‌వ‌హ‌రించి.. రూ.2 కోట్ల రూపాయ‌ల‌ను వృథా చేశార‌న్న‌ది అభియోగం.

అప్ప‌ట్లో అగ్నిమాప‌క శాఖ‌కు సంబంధించి అధునాత సాంకేతిక‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న‌ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఓ ప్రైవేటు సంస్థ‌(స్పుత్నిక్‌)కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే.. ఈ సంస్థ ఎలాంటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు. అగ్నిమాప‌క శాఖ అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బందే ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అయిన‌ప్ప‌టికీ.. సంబంధిత కంపెనీకి.. అవ‌గాహ‌న క‌ల్పించార‌న్న కార‌ణంగా .. 1.7 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించారు. అదేవిధంగా ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌రో 30 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఏమీ కొన‌లేదు.

ఈ వ్య‌వ‌హారంపై అందిన ఫిర్యాదు మేర‌కు ఏసీబీ అధికారులు సంజ‌య్‌పై కేసు న‌మోదు చేశారు. దీంతో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం.. ప్ర‌య‌త్నించారు. హైకోర్టు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ క్ర‌మంలో 79 పేజీల తీర్పు ఇవ్వ‌డం వివాదంగా మారింది. దీనిని సుప్రీంకోర్టులో ఏసీబీ అధికారులు స‌వాల్ చేయ‌డంతో.. హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపి వేసిన సుప్రీంకోర్టు.. సంజ‌య్‌ను 26వ తేదీ(ఈరోజు)న విచార‌ణ (ట్ర‌య‌ల్‌) కోర్టులో లొంగిపోవాల‌ని ఆదేశించింది. దీంతో తాజాగా సంజ‌య్ విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.