ట్రంప్ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చిందా? అమెరికాలో లైవ్ మరణశిక్ష వివాదం!
2009 నవంబర్ 5. టెక్సాస్ లోని ఫోర్ట్ హుడ్ మిలటరీ బేస్. మధ్యాహ్నం 1.34 నిమిషాల సమయం.
By: Garuda Media | 16 Oct 2026 11:00 PM IST2009 నవంబర్ 5. టెక్సాస్ లోని ఫోర్ట్ హుడ్ మిలటరీ బేస్. మధ్యాహ్నం 1.34 నిమిషాల సమయం. అమెరికా సైన్యంలో మేజర్ ర్యాంకులో ఉన్న మానసిక వైద్యుడు నిదాల్ మాలిక్ హసన్ ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పులలో 13 మంది అమాయక సైనికులు చనిపోగా, 32 మంది గాయపడ్డారు.
ఇది ఇస్లామిక్ తీవ్రవాద ప్రేరేపిత దాడిగా పరిగణించారు. 2013లో మిలిటరీ కోర్ట్ మార్షల్ లో అతను దోషిగా నిరూపించబడడంతో అతనికి మరణశిక్ష విధించారు. ఆ తరువాత ఆయన పై కోర్టులకు అప్పీళ్లు చేసుకున్నాడు. అనంతరం 2025 మార్చిలో సుప్రీంకోర్టు కూడా రివ్యూను తిరస్కరించింది. 2026 అక్టోబరులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణశిక్షను ఆమోదించారు.
అయితే ఈ మరణశిక్ష లైవ్ స్ట్రీమింగ్ లో ఈ ఏడాది డిసెంబరు 3న ఫోర్ట్ హుడ్ లోనే సైనికులు తుపాకులతో కాల్చిచంపడం ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. దీనిని డిఫెన్స్ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ ప్రతిపాదించారు. దీనిని ప్రజలు చూడాలని, పెంటగాన్ నుండి లైవ్ స్ట్రీమ్ చేయాలని భావించారు. ఇలాంటి నేరాలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకుంటారని భావించారు.
ఇది అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇలా మరణశిక్ష విధించడం మధ్యయుగాల నాటి చరిత్ర. నిరంకుశ దేశాలు చేసే పని అన్న విమర్శలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులకు ప్రచార సాధనంగా మారుతుందని, పిల్లలు కూడా చూసే అవకాశం ఉంటుందన్న విమర్ళలు, ఆందోళనలు వెల్లడయ్యాయి. రిపబ్లికన్ నాయకులు, మతపెద్దలు, మానవహక్కుల సంఘాలు, చట్ట నిపుణులు దాదాపు 80 శాతం మంది వ్యతిరేకించారు.
మొదట దీనికి ట్రంప్ అంగీకరించినా అక్టోబరు 15న వెనక్కి తగ్గారు. టెర్రరిస్టులతో అమెరికా ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచానికి చూపించాలని అనుకున్నా, మంచి ఉద్దేశాలు ఉన్న మనుషులు అతను చనిపోవడం చూడకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నాం అని తన ట్రూత్ సోషల్ పోస్టులో వెల్లడించారు. హసన్ ను డిసెంబరు 3న ఫైరింగ్ స్క్వాడ్ తో మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు.
