Begin typing your search above and press return to search.

ఏడుగురు నిందితులు, రెండు సంస్థలు... పహల్గాం చార్జిషీట్ సిద్ధం!

ఏప్రిల్ 22 - 2025 న ప్రశాంత భారతదేశంలోని పహల్గాం లోయలో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   15 Dec 2025 11:08 PM IST
ఏడుగురు నిందితులు, రెండు  సంస్థలు... పహల్గాం చార్జిషీట్  సిద్ధం!
X

ఏప్రిల్ 22 - 2025 న ప్రశాంత భారతదేశంలోని పహల్గాం లోయలో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతీ తెలిసిందే. ఈ సమయంలో.. ఆ దాడి జరిగిన సుమారు ఎనిమిది నెలల తర్వాత ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి జరిగిన సుమారు ఎనిమిది నెలల తర్వాత.. ఆ మారణహోమానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏడుగురు నిందితులు, ఐదుగురు అనుమానితులు, లష్కరే తోయిబా (ఎలీటీ), ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనే పాకిస్థాన్ కు చెందిన రెండు ఉగ్రవాద సంస్థలపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. 1,597 పేజీలలో దీన్ని పొందుపరిచింది.

ఈ ఛార్జిషీట్ లో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్రలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన సహాయక ఆధారాలను వివరించిన ఎన్.ఐ.ఏ.. ఈ పహల్గాం ఉగ్ర దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో రెండు ఉగ్రవాద సంస్థల పాత్రలపైనా అభియోగాలు మోపింది. ఇదే సమయంలో.. లష్కరే తోయిబా అగ్ర కమాండర్ సాజిద్ జాట్, పహల్గాం దాడికి ప్రధాన నిర్వాహకుడిగా పేరు చేర్చింది.

ఇదే సమయంలో.. జూలైలో శ్రీనగర్ సమీపంలోని జరిగిన ఎన్ కౌంటర్ లో కాల్చి చంపబడిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు.. హబీబ్ తాహిర్ జిబ్రాన్, సులేమాన్ షా, హంజా ఆఫ్గని ల పేర్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీట్ లో పొందుపరించింది. అదేవిధంగా.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అరెస్ట్ చేసిన మరో ఇద్దరు అనుమానితులు పర్వేజ్, బషీర్ లపై కూడా ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.

ఈ నేపథ్యంలో... పైన పేర్కొన్న రెండు ఉగ్రవాద సంస్థలతో పాటు నలుగురు నిందితులపైనా భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్), ఆయుధ చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సంబంధిత సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు.

ఎవరీ సాజిద్ జాట్..?:

2022 అక్టోబర్ లో వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించబడిన సాజిద్ జాట్.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని అంటారు. మరోవైపు.. టీ.ఆర్.ఎఫ్. ఆపరేషన్ చీఫ్ గా మాత్రమే కాకుండా.. కశ్మీర్ లోయలో ఉగ్ర నియామకాలు చేయడుతూ, నిధులు, చొరబాట్లకు బాధ్యుడు అని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి!

ఇతడికి సంబంధం ఉన్న కొన్ని ప్రధాన ఉగ్రదాడుల విషయానికొస్తే... 2023లోని ధంగ్రీ ఊచకోత, 2024 మేలో పూంచ్ లో వైమానిక దళ కాన్వాయ్ పై దాడి, 2024 జూన్ లో రియాసి బస్సు దాడి గా చెబుతున్నారు. కశ్మీర్ లోని ఉగ్ర నెట్ వర్క్ లో ఇతడిని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణిస్తారు!