మీ ఫాస్టాగ్ ఫ్రీగా రూ.వెయ్యి రీఛార్జ్.. ఇలా చేస్తే సరి
సంస్కరణల దిశగా దూసుకెళుతోంది భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ).
By: Garuda Media | 14 Oct 2025 9:58 AM ISTసంస్కరణల దిశగా దూసుకెళుతోంది భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ). ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ సంస్థ.. ఇప్పటికే టోల్ ఫ్లాజాలను పెద్ద ఎత్తున మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించారు. మీరు జాతీయ రహదారుల్లో ప్రయాణించే వేళలో.. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసే వాష్ రూం (మరుగుదొడ్లు) అపరిశుభ్రంగా ఉంటే.. వాటి గురించి ఉత్తినే తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
దీనికి సంబంధించిన ఫిర్యాదు చేస్తే.. మీ ఫాస్టాగ్ కు రూ.వెయ్యి రీఛార్జ్ తో నజరానా లభిస్తుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర నిర్ణయాన్ని తాజాగా ఎన్ హెచ్ఏఐ ప్రకటించింది. అయితే.. ఇందుకు కాలపరిమితిని నిర్ణయించారు. ఈ రివార్డును ఈ నెలాఖరు వరకే అందుబాటులోకి రానుంది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు ఈ తరహా ఫిర్యాదుల కోసం ‘‘రాజమార్గ్ యాత్ర’’ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది.
ఈ యాప్ ద్వారా తమ పేరు.. వివరాలు.. లొకేషన్.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు.. మొబైల్ నెంబరు వివరాల్ని నమోదు చేయటంతో పాటు.. అపరిశుభ్రంగా ఉన్న టోల్ ప్లాజా వాష్ రూం ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారి ఫిర్యాదులో న్యాయం ఉంటే.. వారి ఫాస్టాగ్ ఖాతాకు రూ.వెయ్యి రీఛార్జ్ ను నజరానా రూపంలో అందిస్తారు. మరి.. ఎందుకు ఆలస్యం. మీరు ప్రయాణించే ప్రాంతాల్లోని టోల్ ప్లాజాలోని వాష్ రూంలను పరిశీలించి.. వాటిపై ఫిర్యాదు చేయటం ద్వారా.. వాటిని మెరుగుపర్చటంతో పాటు.. మీ ఫాస్టాగ్ ను రూ.వెయ్యి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది మర్చిపోవద్దు.
