భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త శకం: 22 నుంచి "జీఎస్టీ ఉత్సవ్"
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ “జీఎస్టీ ఉత్సవ్”ను ప్రారంభించి, దేశ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలకనున్నారు.
By: A.N.Kumar | 21 Sept 2025 10:24 PM ISTభారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ “జీఎస్టీ ఉత్సవ్”ను ప్రారంభించి, దేశ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలకనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తదుపరి తరం జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు అన్ని వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.
ముఖ్య మార్పులు, లక్ష్యాలు
ప్రస్తుతం నాలుగు పన్ను శ్రేణులు (5%, 12%, 18%, 28%) ఉన్న జీఎస్టీ విధానంలో ఇకపై రెండు శ్రేణులు మాత్రమే ఉండనున్నాయి. 12% మరియు 28% పన్ను శ్రేణులు తొలగించబడతాయి. ఇకపై కేవలం 5% మరియు 18% పన్ను మాత్రమే అమలులో ఉంటుంది. ఈ మార్పుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు
సామాన్య ప్రజలకు ప్రయోజనం:
ఈ సంస్కరణలు పేద , మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తాయి. వస్తువుల ధరలు తగ్గుతాయి, తద్వారా ప్రజల పొదుపు పెరుగుతుంది.
ఆర్థిక వ్యవస్థకు బలం:
కొత్త విధానం వల్ల వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి, పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత బలం చేకూరుస్తుంది.
వ్యాపారాలకు సులభం:
పన్ను శ్రేణులు తగ్గడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. ఇది తయారీదారులు, వినియోగదారులు.. అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక చారిత్రక సంస్కరణ
2017లో ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ (వస్తువులు , సేవల పన్ను) వ్యవస్థ అప్పటికే పన్నుల విధానంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. వివిధ పన్నుల వల్ల ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇది తొలగించింది. ఇప్పుడు ప్రజలు, రాష్ట్రాలు, వ్యాపార వర్గాలతో విస్తృత చర్చల తర్వాత "నెక్స్ట్ జెన్ జీఎస్టీ" సంస్కరణలను అమలు చేస్తున్నారు.
దేవి నవరాత్రుల శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా “జీఎస్టీ ఉత్సవ్” ప్రారంభం కానుంది. ఈ కొత్త మార్పులతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతంగా.. ప్రజల జీవితాలకు మరింత ఉపయోగకరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంస్కరణలు దేశాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి కొత్త ఊపునిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
