Begin typing your search above and press return to search.

10 నిమిషాలు దాటితే డోర్ ఓపెన్.. న్యూయార్క్ స్మార్ట్ టాయిలెట్లపై చర్చ ఎందుకంటే?

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలో పబ్లిక్ టాయిలెట్ దొరకడమే ఒక గొప్ప యుద్ధం.

By:  A.N.Kumar   |   19 Sept 2026 1:18 PM IST
10 నిమిషాలు దాటితే డోర్ ఓపెన్.. న్యూయార్క్ స్మార్ట్ టాయిలెట్లపై చర్చ ఎందుకంటే?
X

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలో పబ్లిక్ టాయిలెట్ దొరకడమే ఒక గొప్ప యుద్ధం. అలాంటిది తీరా కష్టపడి టాయిలెట్‌లోకి వెళ్లాక కాసేపు ప్రశాంతంగా ఫోన్ స్క్రోల్ చేసుకుందామన్నా రీల్స్ చూస్తూ లోకాన్ని మరచిపోదామన్నా ఇక కుదరదు.. ఎందుకంటే న్యూయార్క్ సిటీ యాజమాన్యం సరికొత్త ‘స్మార్ట్ పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ల’ను రంగంలోకి దించింది. ఇవి మామూలు టాయిలెట్లు కావు.. టైమ్ బాంబు కన్నా ఘోరంగా పనిచేసే డిజిటల్ టాయిలెట్లు..

నగరంలో పబ్లిక్ టాయిలెట్ల కొరతను తీర్చేందుకు సుమారు 4 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 17 హైటెక్ స్మార్ట్ రెస్ట్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ ధర అక్షరాలా 2.35 లక్షల డాలర్లకు పైమాటే.. ఫోన్, ట్రాన్సిట్ లేదా బ్యాంక్ కార్డుతో అన్‌లాక్ చేసుకుని లోపలికి వెళ్లే ఈ సదుపాయంలో అంతా టెక్నాలజీ మయమే. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఈ స్మార్ట్ టాయిలెట్లలో పెట్టిన ఓ 'మాస్టర్ ఫీచర్' ఇప్పుడు నెటిజన్లకు.. న్యూయార్క్ వాసులకు నిద్రలేకుండా చేస్తోంది. అదే ‘10 నిమిషాల కౌంట్‌డౌన్ టైమర్’

డోర్ ఓపెన్ అవుతుంది... జాగ్రత్త

మీరు లోపలికి వెళ్లిన సరిగ్గా 10 నిమిషాలకు ఈ స్మార్ట్ సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ హెచ్చరికను పట్టించుకోకుండా "ఇంకో రెండు నిమిషాలు ఉంటే ఏమవుతుందిలే" అని నిర్లక్ష్యం చేశారో.. అంతే సంగతులు.. 10 నిమిషాలు పూర్తికాగానే ఏమాత్రం మొహమాటం లేకుండా తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. లోపల మీరు ఏ పరిస్థితిలో ఉన్నారనే దానితో ఆ స్మార్ట్ డోర్‌కు సంబంధం లేదు..

మేయర్ జొహ్రాన్ మమ్దానీ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. "ఇది స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తూ గంటల తరబడి కూర్చోవడానికి ఉండే ప్రదేశం కాదు" అని తేల్చి చెప్పారు. పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లను ఎక్కువ మంది ఉపయోగించుకునేలా చేయడం.. డ్రగ్స్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

నెటిజన్ల కంగారు.. మీమ్స్ రచ్చ

ఈ ఫీచర్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. "అవసరం లేకపోయినా గంటలు గడిపే సోమరిపోతులకు ఇది సరైన శిక్ష" అని కొందరు మద్దతు ఇస్తుంటే మరికొందరు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఒకవేళ పొట్ట సరిగ్గా లేక నిజంగానే కాస్త ఎక్కువ సమయం పడితే పరిస్థితి ఏంటి సామీ? అందరి ముందు తలుపు తెరుచుకుంటే పరువు పోదా?" అని భయపడిపోతున్నారు.

మొత్తానికి న్యూయార్క్‌లో పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లడమంటే ఇకపై కేవలం అవసరం తీర్చుకోవడం మాత్రమే కాదు.. అది ఒక పెద్ద ‘రియాలిటీ షో’ టాస్క్ లాంటిది. అక్కడ సమయపాలన పాటించకపోతే టెక్నాలజీ మీ పరువును బజార్న పడేయడం ఖాయం.. ప్రస్తుతం పరీక్షాత్మకంగా 17 చోట్ల ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వచ్చే ఏడాది నగరమంతా విస్తరిస్తారట. కాబట్టి న్యూయార్క్ వాసులారా.. టాయిలెట్‌కి వెళ్లేముందు స్టాప్‌వాచ్ కూడా వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.