అమెరికాలో తీవ్ర హిమపాతం.. తీవ్రత తెలిస్తే వణికిపోతారంతే
సముద్రంపై వాయు పీడనం ఒక్కసారిగా పడిపోవటంతో మంచు తుపాను కాస్తా బాంబ్ సైక్లోన్ గా మారినట్లుగా పేర్కొంటున్నారు.
By: Garuda Media | 24 Feb 2026 1:18 PM ISTసంచలన నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఆ దేశాన్ని నేచర్ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. గతంతో పోలిస్తే గడిచిన ఏడాది కాలంలో చోటు చేసుకున్న విపత్తులతో అగ్రరాజ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకోగా.. తాజాగా మరోసారి విరుచుకుపడిన మంచు తుపాను న్యూయార్క్ తో పాటు ఈశాన్య అమెరికా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అత్యంత అరుదైనదిగా చెప్పే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా భారీగా మంచు కురిసే వేళలో మెరుపులు.. ఉరుములు ఉండటం చాలా అరుదు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కావటం శాస్త్రవేత్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు.
భారీగా కురుస్తున్న మంచుతో అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనికి తోడు బలమైన చలిగాలుల తీవ్రతతో అక్కడి ప్రజలు ఆగమాగం అవుతున్న పరిస్థితి. న్యూయార్క్ మహానగరంతో పాటు ఈశాన్య అమెరికా రాష్ట్రాల పరిస్థితి తీవ్రంగా ఉంది. దీంతో.. ప్రయాణాల మీద బ్యాన్ తో పాటు.. మంచు తుపాను వార్నింగ్ తో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. దాదాపు 5వేల విమాన సర్వీసులు రద్దు అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిల్లో చాలావరకు న్యూయార్క్, న్యూజెర్సీ.. బోస్టన్ ల మధ్య రాకపోకలు సాగించాల్సిన విమానాలుగా చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు అసాధ్యమని జాతీయ వాతావరణ సేవల విభాగం వెల్లడించింది. ప్రమాదకరమైన మంచు తుపాను పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం వరకు అత్యవసరం కాని జర్నీలను బ్యాన్ చేస్తున్నట్లుగా న్యూయార్క్ సిటీ అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా మంచు తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్పించి ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక.. మంచు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనటానికి నిదర్శనంగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన మంచు తీవ్రతను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రోడ్ ఐలాండ్ లోని ప్రావిడెన్స్ లాంటి నగరాల్లో దాదాపు 32.8 అంగుళాల మంచు నమోదైంది. దాదాపు యాభై సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చెబుతన్నారు. సదరు నగర చరిత్రలోనే ఇదే అత్యధిక హిమపాతంగా చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు. దీంతో న్యూయార్క్ మహానగరంతో పాటు.. ఫిలడెల్ఫియా తదితర నగరాలతో పాటు డెలావేర్ నుంచి మసాచుసెట్స్ వరకు పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మరోవైపు గడిచిన పదేళ్లలో న్యూయార్క్ సిటీలో ఇంతటి భారీ మంచు తుపాను సంభవించలేదని చెబుతున్నారు. సాధారణంగా మంచు కురిసేటప్పుడు ఉరుములు.. మెరుపులు రావటం చాలా అరుదు. కానీ.. ఈ తుపానులో మెరుపులతో కూడిన మంచు కురవటంపై వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో పెరుగుతున్న వైపరీత్యాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సముద్రంపై వాయు పీడనం ఒక్కసారిగా పడిపోవటంతో మంచు తుపాను కాస్తా బాంబ్ సైక్లోన్ గా మారినట్లుగా పేర్కొంటున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మిల్లీబార్ల కంటే ఎక్కువగా పడిపోవటం లాంటివి ఇందుకు నిదర్శనమని చెబుతన్నారు. ఇదో శక్తివంతమైన హరికేన్ లాంటి బలాన్ని పుంజుకుందంటున్నారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చే అతి శీతల గాలులు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి వచ్చే వెచ్చని తేమతో కూడిన గాలితో ఢీ కొనటంతో భారీ స్థాయిలో మంచు ఏర్పడినట్లుగా చెబుతున్నారు.
వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ తక్కువగా కాకుండా.. మరీ ఎక్కువగా కాకుండా సరైన స్థాయిలో ఉండటం.. గాలిలోని తేమ అంతా భారీ తడి మంచుగా మారి నేలపై కురిసినట్లుగా అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణఓగ్రతలు పెరగటంతో ఈ తరహా తుపాన్లకు అదనపు బలం లభిస్తుందని.. అందుకే ఇవి గతంలో కంటే తీవ్రంగా మారుతున్నట్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా అమెరికన్లకు ఇటీవల కాలంలో వరుస షాకుల మాదిరి పరిస్థితి నెలకొంది.
