అమెరికాలో ఘోరం.. ఒక్క సెల్ఫీ తెచ్చిన ముప్పు.. గుర్రపు బగ్గీ ప్రమాదంలో భారతీయ యువకుడి దుర్మరణం
ప్రమాదంలో చిక్కుకున్న తన తల్లిని కాపాడేందుకు 18 ఏళ్ల రోమంచ్ సాహసించాడు. ఆమెను రక్షించే క్రమంలో అతడు కూడా వేగంగా వెళ్తున్న బగ్గీ నుంచి బయటకు దూకాడు.
By: A.N.Kumar | 18 Jun 2026 3:56 PM IST"అమెరికా అంటే అన్నీ పక్కా.. అక్కడ రూల్స్ అంటే రూల్సే!" అని చాలామంది చెప్పుకుంటుంటారు. కానీ అప్పుడప్పుడూ అక్కడ కూడా "అజాగ్రత్త" అనే వైరస్ ఎంత ప్రమాదకరమో నిరూపించే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా విహారయాత్ర కోసం అమెరికా వెళ్లిన ఒక భారతీయ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
సెంట్రల్ పార్క్‌లో చేదు జ్ఞాపకం
భారత్ నుంచి మొదటిసారిగా అమెరికా విహారయాత్రకు వెళ్లిన మహాజన్ కుటుంబానికి.. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్ సందర్శన జీవితాంతం మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మారింది. అక్కడ సరదాగా గుర్రపు బగ్గీలో షికారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 18 ఏళ్ల రోమంచ్ మహాజన్ అనే భారతీయ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
ఒక్క ఫొటో.. ప్రాణం తీసిన నిర్లక్ష్యం
లభించిన సమాచారం ప్రకారం.. బగ్గీలో ప్రయాణిస్తున్న మహాజన్ కుటుంబ సభ్యులను ఒక ఫొటో తీయాలని ఆ వాహన డ్రైవర్ భావించాడు. అయితే ఇందుకోసం అతడు కనీస భద్రతా నిబంధనలను పక్కనబెట్టి గుర్రపు తాళ్లను వదిలేసి వాహనం కిందికి దిగాడు. "ఒక్క ఫొటో కోసం సేఫ్టీని సెలవుపై పంపించేశాడా?" అనిపించేలా డ్రైవర్ కిందకు దిగగానే ఆ గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి అదుపుతప్పింది.
నియంత్రించే డ్రైవర్ లేకపోవడంతో ఆ బగ్గీ గుర్రం అత్యంత వేగంగా రోడ్డుపై దూసుకెళ్లింది. ఊహించని ఈ పరిణామంతో బగ్గీలో ఉన్న కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేశారు. ఈ గందరగోళంలో రోమంచ్ తల్లి బగ్గీ పైనుంచి కిందపడిపోయింది.
తల్లిని కాపాడబోయి.. అనంత లోకాలకు..
ప్రమాదంలో చిక్కుకున్న తన తల్లిని కాపాడేందుకు 18 ఏళ్ల రోమంచ్ సాహసించాడు. ఆమెను రక్షించే క్రమంలో అతడు కూడా వేగంగా వెళ్తున్న బగ్గీ నుంచి బయటకు దూకాడు. కానీ విధి వేరేలా తీర్పు చెప్పింది. కిందపడటంతో రోమంచ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మిగతా కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ కళ్ల ముందే కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.
టూరిజమా? నిర్లక్ష్యమా? మోగుతున్న నిరసనలు
ఈ దారుణ ప్రమాదం తర్వాత న్యూయార్క్ నగరంలో గుర్రపు బగ్గీల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధుల్లో ఇప్పటికీ ఇలాంటి గుర్రపు బగ్గీలను అనుమతించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఫొటో కోసం డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం.. చివరకు ఒక యువకుడి ప్రాణం బలికావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఘటనలో "టూరిజం" కంటే "నిర్లక్ష్యం" పెద్ద పాత్ర పోషించిందని స్థానికులు మండిపడుతున్నారు.
'రైడర్స్ లా' కు డిమాండ్
ఈ విచారకరమైన ఘటనపై న్యూయార్క్ స్టేట్ సెనేటర్ ఎరిక్ బాట్చర్ స్పందించారు. బాధిత భారతీయ కుటుంబానికి తన సానుభూతిని తెలిపిన ఆయన, నగరంలో గుర్రపు బగ్గీలను పూర్తిగా నిషేధించేలా 'రైడర్స్ లా' ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఒక్క ఫొటో... ఒక్క నిర్లక్ష్యం... ఒక్క క్షణం. కానీ ఒక కుటుంబానికి మాత్రం జీవితాంతం తీరని గుండెకోత మిగిల్చింది. "సేఫ్టీ ఫస్ట్" అని ప్రపంచానికి పాఠాలు చెప్పే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆ నియమాలను సరిగ్గా అమలు చేయకపోతే ఎలాంటి భయంకరమైన ఫలితాలు ఉంటాయో ఈ ఘటన ప్రపంచానికి మరోసారి హెచ్చరించింది.
