Begin typing your search above and press return to search.

'గ్రీటింగ్ స్కామ్స్'... న్యూ ఇయర్ కి రెడీగా ఉన్నారు జాగ్రత్త!

కేవలం ఇవతలి వ్యక్తి అమాయకత్వాన్నో, అజ్ఞానాన్నో, భయాన్నో, అతి తెలివినో, అత్యాశనో ఆసరాగా చేసుకుని ఊహించని స్థాయిలో షాకులిస్తుంటాడు.

By:  Raja Ch   |   30 Dec 2025 5:45 PM IST
గ్రీటింగ్ స్కామ్స్... న్యూ ఇయర్ కి రెడీగా ఉన్నారు జాగ్రత్త!
X

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో, తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయాల్లో ఒకటి సైబర్ మోసాలు. అవతలి వ్యక్తి ఎవరో తెలియదు.. ఎక్కడ ఉంటాడో తెలియదు.. ఏమి చేస్తాడో తెలియదు.. వాడి పేరు, ఊరు, అడ్రస్, ఫోటో, ఫోన్ నెంబర్ ఏదీ తెలియదు, వాడు చెప్పినది ఏదీ నిజం కాదు. కేవలం ఇవతలి వ్యక్తి అమాయకత్వాన్నో, అజ్ఞానాన్నో, భయాన్నో, అతి తెలివినో, అత్యాశనో ఆసరాగా చేసుకుని ఊహించని స్థాయిలో షాకులిస్తుంటాడు.

మీకొచ్చిన కొరియర్ లో విదేశీ కరెన్సీ ఉందని, దొంగ పాస్ పోర్టులు ఉన్నాయని, మాదక ద్రవ్యాలు ఉన్నాయని.. మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు అనధికారికంగా డబ్బులు పంపించారని.. లేదా, మీ బ్యాంక్ ఖాతాలకు విదేశాల నుంచి అనధికారికంగా డబ్బులు వచ్చాయని.. రకరకాల కారణాలు చెబుతాడు.. ఈ బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి పద్మభూషణ్ అవార్డ్ గ్రహీతల వరకూ ఉన్నారు. ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు ఎవరి పేరునైనా వాడేస్తుంటారు.

ఇందులో భాగంగా.. గతంలో హనీ ట్రాప్ లో భాగంగా అమ్మాయిల వాయిస్, అమ్మాయిల్లా మెసేజ్, కాసేపు అమ్మాయిలతో వీడియో కాల్, అనంతరం బ్లాక్ మెయిల్ నుంచి.. తాను పోలీసులమని, సీబీఐ అధికారులమని, ఈడీ ఆఫీసర్లమని బెదిరించి డిజిటల్ అరెస్ట్ పేరున దోచుకునేవారు. ఇటీవల ముంబైలో ఓ మహిళను ఏకంగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్పి మరీ మోసం చేసిన పరిస్థితి. మార్గం ఏదైనా మోసం కామన్ అయిపోయిన రోజులివి!

హనీ ట్రాప్, డిజిటల్ అరెస్ట్, మెసేజ్ ల్లో ".ఏపీకే" ఫైల్స్... విధానం ఏదైనా నిధానంగా నిలువు దోపిడీయే ఈ సైబర్ నేరగాళ్ల అంతిమ లక్ష్యం. పైగా ఇటీవల కాలంలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ లేకుండా వాట్సప్ కి ఓ మెసేజ్ పంపి, అందులో ఓ .ఏపీకే ఫైల్ పంపుతున్నారు. ఎవరో ఏదో పంపారనుకుని పొరపాటున ఆ మెసేజ్ ఓపెన్ చే సి, వాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే.. మొత్తం క్షవరం అయిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంది! ఆ తర్వాత వివరం తెలిసినా నో యూజ్!!

అవును... నూతన సంవత్సర సంబరాలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి అందరి ఫోన్స్ లోనూ మెసేజ్ ల సౌండ్స్ వస్తూనే ఉంటాయి. "హ్యాపీ న్యూ ఇయర్" అని తెలుగులోనూ, ఇంగ్లిష్ లోనూ వరుస మెసేజ్ లు, గ్రీటింగ్ పోస్టర్లు కనిపిస్తుంటాయి. ఈ మధ్యలో.. సైబర్ నేరగాళ్ల శుభాకాంక్షల మెసేజ్ లు కూడా వస్తుంటాయి.. పొరపాటున వాటిపై క్లిక్ చేస్తే... "శాడ్ న్యూ ఇయర్" అయిపోయే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ప్రజలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా.. న్యూ ఇయర్ సందర్భంగా జరిగే గ్రీటింగ్ స్కామ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాట్సప్, టెలిగ్రామ్, జనరల్ మెసేజ్ ద్వారా వచ్చే గ్రీటింగ్స్ మెసేజ్, న్యూ ఇయర్ గిఫ్ట్ మీకోసమే, న్యూ ఇయర్ వేళ బ్యాంకు రివార్డులు, మీరే లక్కీ విన్నర్ వంటి మెసేజ్ లతో .ఏపీకే ఫైల్స్ పంపుతారని చెబుతున్నారు!

వాటిపై క్లిక్ చేయగానే అవి ఫోన్ లో ఇన్ స్టాల్ అయ్యి.. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, పర్సనల్ ఫోటోస్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే... ఈ గ్రీటింగ్స్ స్కామ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. "క్లిక్ హియర్" అనే వాటిని ఏమాత్రం టచ్ చేయకూడదని చెబుతున్నారు!!