కొత్త కండీషన్ : గ్రీన్ కార్డ్ కావాలంటే ముందుగా గ్రీన్ సిగ్నల్ తీసుకురా బాబూ!
అయితే ఇప్పటివరకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది.
By: A.N.Kumar | 28 May 2026 10:56 AM ISTఅమెరికా వెళ్లాలి... అక్కడ సెటిల్ అవ్వాలి... పిల్లలను అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడించాలి... అనేది ఎంతో మంది భారతీయ మధ్యతరగతి కుటుంబాల ‘అల్టిమేట్ డ్రీమ్’. ఈ గ్లోబల్ కలలో అత్యంత పవిత్రమైన.. విలువై న వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘గ్రీన్ కార్డ్’ మాత్రమే.
అయితే ఇప్పటివరకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ కావాలంటే ఏదో ఆధార్ అప్‌డేట్ లాగా సింపుల్‌గా అయిపోతుందని అనుకుంటే పొరపాటే... “ముందు ఇండియాకి వెళ్లి అప్లై చెయ్యి… ఆ తర్వాత సంగతి చూద్దాం” అంటూ కొత్త రూల్ తీసుకువచ్చింది.
'అత్తారింటికి దారేది' బ్రహ్మానందంలా ఐటీ ఉద్యోగుల పరిస్థితి!
ఈ కొత్త నిర్ణయం విన్న తర్వాత అమెరికాలో ఉన్న చాలామంది భారతీయ ఐటీ ఉద్యోగుల పరిస్థితి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందం లాగా మారిపోయింది. ఇన్నేళ్లు ఆన్‌సైట్‌లో రాత్రింబవళ్లు కష్టపడి ట్యాక్సులు కడుతూ కంపెనీల కోసం కోడింగ్ చేసినా... చివరికి “బాబూ… మీ ఊరికి వెళ్లి క్యూలో నిలబడు” అనడంతో అంతా తలపట్టుకుంటున్నారు. “మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ లేదా వైజాగ్ లోని పాస్‌పోర్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాలా?” అని వాపోతున్నారు.
నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి బాబూ?
ఈ కొత్త నిబంధనల్లో యూఎస్‌సీఐఎస్ ఒక ‘స్పెషల్ ఎగ్జెంప్షన్’ కూడా ఇచ్చింది. మీ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం చేకూరినా లేదా మీ పని ‘నేషనల్ ఇంట్రెస్ట్’ పరిధిలోకి వచ్చినా... అమెరికాలోనే ఉండి ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ మేనేజర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. “సార్… నా కోడింగ్ వల్ల యూఎస్ ఎకానమీకి ఎంత బెనిఫిట్ వస్తుందో ఒక రికమండేషన్ లెటర్ ఇవ్వండి సార్… లేదంటే గ్రీన్ కార్డ్ కోసం గుంటూరుకో, విజయవాడకో వెళ్లాల్సి వస్తుంది!” అని ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... ‘నేషనల్ ఇంట్రెస్ట్’ అంటే ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు. నాసా లో పని చేసే వాళ్ళో, ఏఐ సైంటిస్టులో అయితే ఓకే... కానీ రోజూ క్లయింట్ కాల్స్‌లో “క్యాన్ యూ హియర్ మీ?” అని అడుగుతూ జీరా టికెట్స్ క్లోజ్ చేసే నార్మల్ ఐటీ ఉద్యోగి ఈ కేటగిరీ కిందకు వస్తాడా? అంటే స్వయంగా యూఎస్‌సీఐఎస్ వాళ్లే భుజాలు ఎగరేస్తున్నారు.
లింక్డ్‌ఇన్‌లో కొత్త ట్రెండ్.. బిజినెస్ కాలిక్యులేషన్స్!
ఈ దెబ్బతో చాలామంది భారతీయులు లింక్డ్‌ఇన్ లో సరికొత్త స్కిల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇప్పుడు కేవలం పైథాన్, జావా, క్లౌడ్ నేర్చుకుంటే సరిపోవడం లేదు... “హౌ టు బెకమ్ నేషనల్ ఇంట్రెస్ట్?” అనే కోర్సుల కోసం సెర్చ్ చేస్తున్నారు. మరికొందరైతే క్రియేటివ్ ఆలోచనలతో లెక్కలు వేస్తున్నారు. “నేను యూఎస్‌లో బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎకనామిక్ బెనిఫిట్ కేటగిరీ కిందకు వస్తానా?” “ఐపీఎల్ కామెంటరీ యూట్యూబ్ ఛానెల్ పెడితే అది నేషనల్ ఇంట్రెస్ట్ అవుతుందా?” అని ఆరా తీస్తున్నారు.
ఇక ఇండియాలో ఉండే తల్లిదండ్రుల పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. ఇప్పటివరకు చుట్టుపక్కల వాళ్ల ముందు “మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు” అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు సడన్‌గా “గ్రీన్ కార్డ్ కోసం మళ్లీ ఊరికే వస్తున్నాడట” అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు.
అమెరికా ఒక పెద్ద రియాలిటీ షో!
మొత్తంగా చూస్తే... అమెరికా ఇప్పుడు ఒక పెద్ద రియాలిటీ షోలా మారిపోయింది. అందులో ప్రతి హెచ్-1బీ ఉద్యోగి ఒక కంటెస్టెంట్, గ్రీన్ కార్డ్ అనేది ఒక ట్రోఫీ, యూఎస్‌సీఐఎస్ ఆ షోకి జడ్జ్! మరి ఎవరికి ఏ ఎలిమినేషన్ రౌండ్ వస్తుందో ఎవరికీ తెలియడం లేదు.
అయితే భారతీయులకు ఉన్న ఓపిక, డాక్యుమెంటేషన్ స్కిల్స్, ఎంబసీ అపాయింట్‌మెంట్స్ దక్కించుకోవడంలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూసి అమెరికా కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే... క్యూలో నిలబడటం, ఫారాలు ఫిల్ చేయడం, 'సర్వర్ బిజీ' మెసేజ్‌లు చూడడంలో మనకు ఉన్న 'అన్‌మ్యాచ్‌డ్ ఎక్స్‌పీరియన్స్' ప్రపంచంలో మరెవరికీ లేదు కదా!
