పీజీలో ఉంటున్నారా? ఇక ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాలి
ఈ నూతన ప్రతిపాదనలను కేవలం కొత్త రూల్స్‌గా కాకుండా విద్యార్థుల భద్రత, యజమానుల బాధ్యత, అద్దెల నియంత్రణ అనే మూడు ముఖ్యమైన కోణాల్లో ప్రభుత్వం రూపుదిద్దుతోంది.
By: A.N.Kumar | 11 Sept 2026 12:00 AM ISTదేశంలోని ప్రధాన నగరాల్లో చదువుకునే విద్యార్థులకు పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు దాదాపు రెండో నివాసాలుగా మారిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె వంటి మహానగరాల్లో వేలాది మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసం కోసం పీజీల్లోనే కాలం గడుపుతున్నారు. అయితే ఇలాంటి వసతి గృహాల్లో సరైన భద్రత, అగ్నిప్రమాద నివారణ చర్యలు, భవన నిర్మాణ నాణ్యత, అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్లపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఇటీవల ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఒక పీజీ భవనం ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటన తర్వాత, పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లపై నియంత్రణను కఠినతరం చేసేందుకు ప్రభుత్వం ఒక నూతన విధివిధానాల చట్రాన్ని సిద్ధం చేస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలను కేవలం కొత్త రూల్స్‌గా కాకుండా విద్యార్థుల భద్రత, యజమానుల బాధ్యత, అద్దెల నియంత్రణ అనే మూడు ముఖ్యమైన కోణాల్లో ప్రభుత్వం రూపుదిద్దుతోంది.
ఈ కొత్త విధానంలో భాగంగా ప్రతి పీజీకి ప్రత్యేక రిజిస్ట్రేషన్, అధికారిక లైసెన్స్ , యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను తప్పనిసరి చేయనున్నారు. దీనివల్ల నిబంధనలు పాటించకుండా అక్రమంగా పీజీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. అంతేకాకుండా పీజీ నిర్వాహకులకు పోలీస్ క్లియరెన్స్, భవన భద్రతా సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ వంటి అనుమతులు పొందడం తప్పనిసరి కానుంది. మరోవైపు పీజీల వివరాలను ఒక పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులు తాము చేరబోయే వసతి గృహానికి సరైన అనుమతులు ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవచ్చు. యజమానుల వేధింపులు, అధిక అద్దెలు లేదా భద్రతా లోపాలపై విద్యార్థులు తమ పేర్లను వెల్లడించకుండా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కూడా ఇందులో కల్పిస్తున్నారు.
ఈ నిబంధనల్లో విద్యార్థుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పీజీ ప్రవేశ ద్వారాలు, కామన్ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి, వాటి ఫుటేజీని కనీసం ముప్పై రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. పదిహేను మంది కంటే ఎక్కువ మంది ఉన్న పీజీల్లో రాత్రి వేళ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు నిరంతరం అందుబాటులో ఉండే వార్డెన్ నియామకం తప్పనిసరి చేయనున్నారు. అద్దెల విషయానికి వస్తే ఆయా ప్రాంతాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, గదిలో ఉండే వ్యక్తుల సంఖ్యను బట్టి నిర్దిష్టమైన రెంట్ బ్యాండ్లను నిర్ణయించి.. విపరీతమైన అద్దె వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్‌ను గరిష్టంగా మూడు నెలల అద్దెకు మాత్రమే పరిమితం చేసి.. విద్యార్థి ఖాళీ చేసిన ముప్పై రోజుల్లోగా ఆ సొమ్మును తిరిగి చెల్లించేలా ఆదేశాలు రానున్నాయి.
కాలేజీలు, యూనివర్సిటీలు కూడా విద్యార్థుల వసతి భద్రతపై నిరంతరం పర్యవేక్షణ జరిపేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పీజీ నిర్వహణలో లైసెన్సులు, సెక్యూరిటీ ఏర్పాట్ల వల్ల యజమానులకు అదనపు ఖర్చు పెరిగినప్పటికీ, ఆ భారాన్ని విద్యార్థులపై పడకుండా ప్రభుత్వం సమతుల్య విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిరంతర తనిఖీలు, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం జరిగితేనే విద్యార్థులకు పీజీల్లో నిజమైన భద్రత లభిస్తుంది.
