పెద్ద ఎత్తున పెరగనున్న జీతాలు...ఫుల్ ఖుషీ !
ఇక కొత్త వేతన సంఘం సిఫార్సులతో పెరుగుదల బాగా ఉంటుందని ఆశిస్తున్నారు. 2.15 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అని లెక్క వేసుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రతీ ఉద్యోగి బేసిక్ పే రెట్టింపు అవుతుంది.
By: Satya P | 24 Dec 2025 6:00 AM ISTజీతం పెరగడం అంటే ఎవరికైనా ఆనందమే. మనిషి కష్టం కానీ అదృష్టం కానీ జీవితం కానీ అన్నీ కలిపి ఒకే చోట ఉంచి రూపం ఇస్తే దాని పేరే రూపాయి గా చెప్పాలి. అలా కరెన్సీ రూపంలో విలువను కొలుస్తూ ఆధునిక సమాజం అందులో సిరిని సంతోషాన్ని చూసుకుంటోంది. ఇక వేతన జీవులు అని ప్రభుత్వ ఉద్యోగస్తులను అంటారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి మంచి జీతాలు ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా మంచి జీతాలు ఉంటాయి. వారికి పే కమిషన్లు ఆలస్యం కావు, డీఏలు క్రమం తప్పకుండా వస్తూంటాయి. ప్రతీ ఏటా బోనస్ ఇతర ఆర్థిక బెనిఫిట్స్ అన్నీ కరెక్ట్ గానే ఇచ్చేస్తారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మరింత ఖుషీ ఇచ్చే వార్త ఒకటి ప్రచారంలో ఉంది.
ఎనిమిదవ వేతన సంఘం :
ఇప్పటిదాకా దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెంచడం కోసం ఏడు వేతన సంఘాలు వేసి వాటి నివేదికలు ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇపుడు ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వస్తోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ కొత్త పే కమిషన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ పదేళ్లకు వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా చూస్తే 2016 తరువాత ఇపుడు 2026 లో కొత్త వేతన సంఘం ఏర్పాటు అవుతోంది. ఈ వేతన సంఘం వర్క్ ఫ్రేమ్ అన్నీ నిర్ణయించి రంగంలోకి దిగేసరికి కొన్ని నెలలు పడుతుందని అంటున్నారు. అయినా సరే 2026 జనవరి 1 నుంచే పెరిగిన లెక్కలు అమలవుతాయి. ఒకవేళ ఈ సిఫార్సులు ఆలస్యం అయితే మధ్యంతరంగా పెరుగుదల కూడా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.
పెరుగుదల ఇలా :
ఇక కొత్త వేతన సంఘం సిఫార్సులతో పెరుగుదల బాగా ఉంటుందని ఆశిస్తున్నారు. 2.15 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అని లెక్క వేసుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రతీ ఉద్యోగి బేసిక్ పే రెట్టింపు అవుతుంది. దాని ప్రకారం జీతాల అంకెలు కూడా పెద్ద ఎత్తున మారిపోతాయని అటున్నారు. ఒక ఉద్యోగి బేసిక్ పే స్కేల్ 20 వేలుగా ఉంటే కొత్త వేతన సంఘం కనుక 2.15 ఫిట్ మెంట్ ని ఆమోదిస్తే జీతం ఏకంగా 43 వేలకు పెరిగిపోతుంది. అదే బేసిక్ పే 50 వేలు ఉంటే కొత్త జీతం ఏకంగా లక్షా 7500 దాకా పెరుగుతుంది.
దిగువ స్థాయిలో కూడా :
చిన్న జీతాలు లెవెల్ టూ త్రీ గా పనిచేసే కేంద్ర సిబ్బందికి కూడా భారీగా వేతనాలు పెరుగుతాయి. ఒక దిగువ ఉద్యోగి జీతం పాతిక వేలు ఉంటే 8 వ వేతన సంఘం సిఫార్సుల తరువాత ఏకంగా 50 వేల పై మాటగా అది చేరుతుంది. అలాగే 30 వేలు తీసుకున్న వారు 65 వేలకు పెరిగిపోతారు. పెన్షనర్లకు కూడా ఈ విధంగా మూల పెన్షన్ లో ఫిట్ మెంట్ పెరిగి వారికి కూడా రెట్టింపు ఆదాయం లభిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి అంతా 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
