Begin typing your search above and press return to search.

హెరాల్డ్ కేసు : రాహుల్ సోనియాకు కొత్త చిక్కులు

ఇక ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే 988 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ కి నామమాత్రపు మొత్తానికి అంటే 50 లక్షల రూపాయలకు బదిలీ చేయడానికి ఒక పథకం అంతా చేశారు అని ఈడీ గట్టిగానే వాదిస్తోంది.

By:  Satya P   |   1 Dec 2025 9:30 AM IST
హెరాల్డ్ కేసు : రాహుల్ సోనియాకు కొత్త చిక్కులు
X

నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ అగ్ర నేతలు గాంధీ వంశీకులు అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీలను వదలడం లేదు. తాజాగా చూస్తే ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది కొత్తగా ఎఫ్ఐఆర్ ని ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసింది. ఈడీ ఇచ్చిన సమాచారంతో రాహుల్ సోనియాలతో పాటు మరో ఆరుగురి మీద ఈ ఎఫ్ఐ ని నమోదు చేశారు. మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడాలతో పాటు, యంగ్ ఇండియా సంస్థ కూడా నేర పూర్తి కుట్ర అభియోగాలలో భాగం అయింది అని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ ని నమోదు చేసింది.

దశాబ్దాల నాటి కేసు :

నిజానికి నేషనల్ హెరాల్డ్ కేసు 2008 నాటిది. ఇప్పటికి 17 ఏళ్ళు పూర్తి అయింది అయితే ఈ కేసులో ఇపుడు కీలక పరిణామంగా ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం కొత్త ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం కుట్ర కోణం అంటూ అభియోగాలు మోపడంతో ఇది సంచలంగా మారుతోంది. ఇక ఈ ఎఫ్ఐఆర్ లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ఆస్తుల సముపార్జనకు సంబంధించి నేరపూరిత కుట్ర మోసం నేరపూరిత నమ్మక ద్రోహం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ అభియోగం :

ఇక ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే 988 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ కి నామమాత్రపు మొత్తానికి అంటే 50 లక్షల రూపాయలకు బదిలీ చేయడానికి ఒక పథకం అంతా చేశారు అని ఈడీ గట్టిగానే వాదిస్తోంది. యంగ్ ఇండియన్‌లో 76 శాతం వాటాను కలిగి ఉన్న సోనియా, రాహుల్ గాంధీలను ఈ కేసులో అంతిమ లబ్ధిదారులుగా పేరొంటోంది. ఇక ఈ ఆరోపణలు అన్నీ కూడా 2010లో జరిగిన లావాదేవీపై దృష్టి సారించాయని చెబుతున్నారు. అలాగే దీనిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఏజేఎల్ నుండి యంగ్ ఇండియన్‌కు 90.21 కోట్ల రూపాయల రుణాన్ని 50 లక్షల రూపాయలకు తిరిగి పొందే హక్కును అప్పగించింది అన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఇక ఈ బదిలీ ద్వారా యంగ్ ఇండియన్ కి దాదాపు అన్ని ఏజేఎల్ షేర్లను అలాగే విలువైన రియల్ ఎస్టేట్‌ను దక్కించుకునే అవకాశం లభించిందని ఆరోపణలు ఉన్నాయి.

మనీలాండరింగ్ విషయం :

అంతే కాదు మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ గతంలో చార్జిషీట్ దాఖలు చేసి 751.91 కోట్ల రూపాయల విలువైన ఏజేఎల్ ఆస్తులను అటాచ్ చేసింది. 2013లో రాజకీయ ప్రముఖుడు సుబ్రమణియన్ స్వామి చేసిన ప్రైవేట్ ఫిర్యాదుతో మొదట్లో ప్రారంభమైన ఈ కేసును రాజకీయంగా ప్రేరేపించబడిందని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పేర్కొంది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదుపై స్పందిస్తూ తమ పైన వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ వ్యర్ధం అని బిజెపి ఘాటైన కామెంట్స్ చేస్తోంది అంతే కాదు, బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీని మీద మాట్లాడుతూ, ఇది స్పష్టమైన అవినీతిగా ఉందని అన్నారు అలాగే ఇది అధికారం దుర్వినియోగ కేసుగా ఆరోపించారు. బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణలు చేయడంలో సహేతుకత లేదని ఎందుకంటే ఈ కేసు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే హెరాల్డ్ కేసు మరో మలుపు తిరిగింది అని అంటున్నారు.