18మంది మృతి చెందిన తొక్కిసలాటకు కారణం ఇదే.. మంత్రి క్లారిటీ!
ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 2 Aug 2025 6:00 PM ISTఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో నలుగురు పిల్లలు, 11 మంది మహిళలు సహా 18 మంది మరణించారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలిపారు. ప్రయాణీకుడి తలపై ఉన్న పెద్ద లగేజీ కిందపడటం వల్లే తొక్కిసలాట జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అవును... ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఒక ప్రయాణికుడి భారీ లగేజీ కిందపడటమే ఈ విషాదానికి కారణమని తెలిపారు. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... మహాకుంభ్ ఉత్సవాల కోసం రైళ్లలో ప్రయాణించడానికి భారీ సంఖ్యలో ప్రయాణికులు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారని.. దీంతో ప్లాట్ ఫారమ్ 14, 15కి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై రద్దీ నెలకొందని తెలిపారు.
ఆ సమయంలో.. చాలా మంది ప్రయాణికులు తమతో పాటు పెద్ద మొత్తంలో లగేజీని, ముఖ్యంగా తలపై పెట్టుకునే భారీ సంచులను మోసుకెళ్తున్నారని.. దీనివల్ల వంతెనపై ప్రయాణికుల కదలికలకు ఆటంకం ఏర్పడిందని.. అదే సమయంలో ఒక ప్రయాణికుడి తలపై ఉన్న భారీ లగేజీ అదుపుతప్పి కిందపడటంతో.. ఆయన దాన్ని తీసేందుకు కిందకు వంగారని తెలిపారు.
ఆ ప్రయత్నమే పక్కనే ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటానికి దారితీసిందని.. ఇలా అనేక మంది కింద పడి తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా పడిపోతున్న బరువును ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ గుర్తించిందని అన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో అత్యధికులు కుంభమేళా ఉత్సవాలకు వెళ్తున్న భక్తులే అని మంత్రి వెల్లడించారు.
ఆ రోజు సాయంత్రం గంటకు 1,500 చొప్పున 7,600 అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు అమ్ముడయ్యాయయని.. సాయంత్రం 6 గంటల నుండి రద్దీ పెరిగిందని.. రాత్రి 8.48 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో... ప్రయాణికుల భద్రతను మెరుగు పరచడానికి, రైల్వే అధికారులు క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ ను కూడా కఠినతరం చేశారని అన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైందని స్పష్టం చేశారు. ఐదుగురు సీనియర్ అధికారులను బదిలీ చేశారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. కాగా... 2017లో ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రోడ్ తొక్కిసలాటలో 23 మంది మృతి చెందిన తర్వాత జరిగిన అత్యంత దారుణమైన రైల్వే స్టేషన్ సంఘటన ఇది!
