వీధి కుక్కలు లేని దేశంగా రికార్డు
ఈ ప్రపంచంలో మనిషితో పాటు ఏకంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో అన్నీ మనిషితో ఉండవు కానీ కొన్ని పెంపుడు జంతువులుగా మానవ జీవితంలో భాగం అయ్యాయి.
By: Satya P | 27 Dec 2025 5:00 AM ISTఈ ప్రపంచంలో మనిషితో పాటు ఏకంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో అన్నీ మనిషితో ఉండవు కానీ కొన్ని పెంపుడు జంతువులుగా మానవ జీవితంలో భాగం అయ్యాయి. అలా కుక్కలు పిల్లులు మనిషితోనే యుగాల సావాసం చేస్తూ వస్తున్నాయి. కుక్కల విషయం వస్తే వాటిని ఎక్కువ మంది పెంచుకుంటారు కూడా. పెంచుకున్న కుక్కలు కాకుండా రోడ్ల మీద తిరిగే కుక్కలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలో ప్రతీ దేశంలో వీధి కుక్కలు తప్పనిసరి. కానీ ఒకే ఒక్క దేశం వీధి కుక్కల బెడద నుంచి తాజాగా బయటపడింది. పైగా ప్రపంచానికి ఆదర్శమై రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి అంటే నెదర్లాండ్ అని చెప్పాలి.
ఎలా సాధ్యమైంది :
వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. కానీ నెదర్లాండ్ ఎలా చేయగలిగింది అంటే వ్యూహాత్మకమైన విధానాలతో అని చెప్పాలి. వీధి కుక్కలను పట్టుకోవడం ఒక దశ అయితే వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం రెండవ దశ. ఆ మీదట వాటి వల్ల రేబీస్ వంటి వ్యాధులు మనిషికి సంక్రమించకుండా టీకాలు చేయడం ఇంకో దశ. అంతే కాదు కుక్కలను పెంచే వారు బాధ్యతా రహితంగా వాటిని రోడ్ల మీదకు వదిలేయకుండా వారి విషయంలో కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారానే నెదర్లాండ్ ఇపుడు వీధి కుక్కలను లేని దేశంగా మారింది అని అంటున్నారు.
ప్రభుత్వం చొరవ :
వీధి కుక్కలను పట్టుకోవాలన్నది కచ్చితంగా ఒక నిబద్ధతతో నెదర్లాండ్ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే వాటికి ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడంతో అంతే నిబద్ధత చూపించింది. వాటిని తిరిగి సురక్షితమైన ప్రాంతాలలో విడిచి పెట్టడంలోనూ ఎంతో శ్రద్ధ చూపించింది. ఈ విధానం వల్ల కొత్త కుక్కలు అన్నవి పుట్టలేదు, పెరగలేదు, వీధుల్లోకి అసలు రాలేదు. ఇక పెంపుడు కుక్కల విషయంలో పన్నులు కూడా అధికంగా వేసి మరీ వాటి యజమానులకు బాధ్యత క్రమశిక్షణ అన్నది అర్థం అయినట్లు అక్కడి ప్రభుత్వం చేసింది. పెట్ షాపులలో కుక్కలను కొనాలంటే వాచిపోయే విధంగా అక్కడి పన్నులు ఉంటాయి. అలాగే బ్రెడర్ల వద్ద కొనాలన్నా ఇవే రూల్స్ టాక్స్ ఉంటుంది. దాంతో జంతు ప్రేమికులు చేసేది లేక షెల్టర్లు వద్ద ఉన్న వీధి కుక్కలనే దత్తత తీసుకోవాల్సి రావడం అనివార్యంగా మార్చింది ప్రభుత్వం.
ఏకంగా జైలుకే :
ఇక తిరిగి ఈ కుక్కలను ఎవరైనా రోడ్ల మీదకు వదిలేస్తే వారికి కనీసంగా మూడేళ్ళు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో కఠిన నిర్ణయం. ఇక వీటి విషయం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ విభాగాలను ఏర్పాటు చేసి నెదర్లాండ్ ప్రభుత్వం కుక్కల విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్న తీరుని రుజువు చేసుకుంది.
భారత్ లో ఇలా చేస్తే :
ఇపుడు వీధి కుక్కల విషయంలో నెదర్లాండ్ ప్రభుత్వం అనుసరించిన తీరునే భారత దేశం కూడా కఠినంగా అమలు చేస్తే దేశంలో సైతం వీధి కుక్కలు కనుమరుగు అవుతాయి అని అంటున్నారు. అంతే కాదు కుక్క కాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఇక పూర్తిగా తగ్గిపోతారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిబద్ధత ముఖ్యం. అలాగే కఠినంగా అన్నీ అమలు చేయాలి. మరి భారత దేశంలో కూడా నెదర్లాండ్ మోడల్ అమలు చేస్తారని ఆశిద్దాం.
