Begin typing your search above and press return to search.

తండ్రి కాబోతున్న ‘గే’ ప్రధాని.. ఎలా సాధ్యమైందంటే?

సాధారణంగా ఒక ఇంట్లో ఇద్దరు పురుషులు ఉన్నారంటేనే రిమోట్ కంట్రోల్ కోసం, టీవీ ఛానెళ్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది.

By:  A.N.Kumar   |   21 Oct 2026 10:32 AM IST
తండ్రి కాబోతున్న ‘గే’ ప్రధాని.. ఎలా సాధ్యమైందంటే?
X

రాజకీయాల్లో శత్రువులను ఎదుర్కోవడం.. పార్లమెంట్లో ప్రత్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఒకెత్తు అయితే.. ఇంట్లో పాలు తాగే పసిపాప ఏడ్చినప్పుడు ఆ ఏడుపుకు అర్థం వెతకడం మరో ఎత్తు. ఇప్పుడు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ సరిగ్గా ఇదే కొత్త రకం గృహ రాజకీయ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. తన భాగస్వామి, అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్ కీనన్‌తో కలిసి సరోగసీ విధానం ద్వారా 2027లో ఓ చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రధాని గారు అధికారికంగా ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితం నిశ్చితార్థం చేసుకున్నా.. ప్రధాని పదవి రాగానే ముందు దేశాన్ని నడపాలి.. ఆ తర్వాతే పెళ్లి మండపం అని వివాహాన్ని కాస్త వాయిదా వేశారు ఈ ‘గే’ ప్రధాని. కానీ ఇంట్లోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించే విషయంలో మాత్రం ఆలస్యం చేసే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్పేశారు.

సాధారణంగా ఒక ఇంట్లో ఇద్దరు పురుషులు ఉన్నారంటేనే రిమోట్ కంట్రోల్ కోసం, టీవీ ఛానెళ్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటిది ఒకవైపు దేశాన్ని నడిపే ప్రధాని.. మరోవైపు మైదానంలో గోల్స్ కొట్టే హాకీ ప్లేయర్ ఉన్న ఈ గే జంట మధ్యలోకి ఇప్పుడు ఒక చిన్నారి రూపంలో కొత్త కమాండర్ రాబోతున్నారు. వైద్య సాంకేతికత పుణ్యామా అని గెస్టేషనల్ సరోగసీ ద్వారా ఒక అండదాత, ఒక సరోగేట్ మదర్ సహాయంతో వీరు తండ్రులు కాబోతున్నారు. నెదర్లాండ్స్ చట్టాలకు లోబడి ఎలాంటి వ్యాపార కోణం లేకుండా స్వచ్ఛందంగా సహకరిస్తున్న ఇద్దరు డచ్ మహిళల సహాయంతో ఈ ప్రక్రియ సాగుతోందని వారి పార్టీ వెల్లడించింది. దేశ బడ్జెట్ ఎలా కేటాయించాలో ప్రధానికి తెలుసు.. హాకీ గ్రౌండ్‌లో ప్రత్యర్థులను ఎలా దాటాలో కీనన్‌కు తెలుసు.. కానీ అర్ధరాత్రి రెండు గంటలకు బిడ్డ డైపర్ మార్చడంలో ఎవరు ముందుంటారో కాలమే నిర్ణయించాలి.

ఇక నెదర్లాండ్స్ విషయానికి వస్తే రూల్స్ మార్చడంలో ఆ దేశం ఎప్పుడూ ముందుంటుంది. 2001లోనే ప్రపంచంలోనే తొలిసారిగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఆ దేశానిది. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానే సరోగసీ ద్వారా తండ్రి కాబోతుండటం చూస్తుంటే మా దేశంలో ఏది జరిగినా కొత్తగానే ఉంటుంది అని డచ్ ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ వేదికపై సరోగసీ, కుటుంబ వ్యవస్థలపై ఈ వార్త పెద్ద చర్చకే తెరలేపింది.

ముందుముందు దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కంటే కూడా రాబోయే రోజుల్లో ప్రధానికి అత్యంత క్లిష్టమైన పనులు ఎదురుకానున్నాయి. ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు పాప ఏడిస్తే దాన్ని ఎలా సంభాళించాలి.? భాగస్వామి కీనన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్, ప్రధాని కేబినెట్ మీటింగ్స్ మధ్య బేబీ సిట్టింగ్ డ్యూటీలను ఎలా పంచుకోవాలి.. దేశ బడ్జెట్ కంటే ఇంట్లో లేటెస్ట్ బొమ్మల బడ్జెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం లాంటి సవాళ్లు ఎన్నో ఉన్నాయి.

ఏది ఏమైనా ప్రధాని హోదాలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే గే ప్రధాని రాబ్ జెట్టెన్‌కు 2027 నుండి ఇంట్లో బిడ్డ చెప్పే మాటలు వినడమే అతిపెద్ద బాధ్యత కానుంది. కాబోయే తండ్రుల డిప్లమసీకి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేద్దాం.