Begin typing your search above and press return to search.

ట్రంప్ ఎస్కేప్ ప్లాన్: నెట్‌ఫ్లిక్స్ 'ది డికాయ్ ప్లేన్' రివ్యూ

టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా బయలుదేరే సమయంలో ఈ సంచలనాత్మక ఘటన జరిగింది.

By:  A.N.Kumar   |   6 Sept 2026 8:42 AM IST
ట్రంప్ ఎస్కేప్ ప్లాన్: నెట్‌ఫ్లిక్స్ ది డికాయ్ ప్లేన్ రివ్యూ
X

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ కేవలం ఒక విమానం మాత్రమే కాదు.. అది ఆకాశంలో త్రిప్పే ఒక భద్రతా దుర్గం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డొనాల్డ్ ట్రంప్ అందరి కళ్లు గప్పి ఒక రహస్య విమానంలోకి మారిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌లా ఉన్న ఈ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీయే ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

అసలు ఆ రోజు ఏం జరిగింది?

టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా బయలుదేరే సమయంలో ఈ సంచలనాత్మక ఘటన జరిగింది. ట్రంప్ యథాతథంగా తన అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనే ప్రయాణిస్తున్నారని మీడియా, ప్రపంచం భావించాయి. కానీ తీవ్రమైన భద్రతా కారణాల దృష్ట్యా రక్షణ సిబ్బంది ఒక అత్యంత రహస్య ప్లాన్‌ను అమలు చేశారు.

ట్రంప్‌ను ఒక సాధారణ క్యాటరింగ్ ట్రక్ ద్వారా విమానం నుంచి ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తీసుకొచ్చి ఒక చిన్న మిలిటరీ విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్ వన్ మాత్రం ట్రంప్ అందులోనే ఉన్నట్లు భ్రమింపజేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. అంటే అది ఒక ‘డికాయ్ ప్లేన్’ గా పనిచేసిందన్నమాట. విమానంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, ఇతర అధికారులు కూడా ఈ రహస్య ఆపరేషన్‌ను అప్పట్లో గుర్తుపట్టలేకపోవడం విశేషం.

ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ప్రధాన పాయింట్లు బయటకొచ్చాయి. అప్పటి ఘటనను దగ్గరుండి చూసిన రాయిటర్స్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫొటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్, వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి డాన్ లామోత్ తమ అనుభవాలను పంచుకోవడం పెద్ద ప్లస్ పాయింట్. అలాగే మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్, ఎయిర్‌ఫోర్స్ వన్ మాజీ సిబ్బంది వాండా జోయెల్ అందించిన సమాచారం ఈ కథనానికి విశ్వసనీయతను తెచ్చింది.

మూసివేసిన కిటికీలు, క్యాటరింగ్ ట్రక్ అసాధారణ కదలికలు, భద్రతా సిబ్బంది ఆందోళన వంటి చిన్న చిన్న అంశాలను చూపిస్తూ దర్శకుడు మిస్టరీ టచ్‌ను చక్కగా మెయింటెన్ చేశారు. అనవసరమైన సాగదీతలు, రాజకీయ విశ్లేషణలు లేకుండా కేవలం ప్రధాన ఘటనపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వడు.

అయితే దీనిని ఒక పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పలేం. ట్రంప్‌కు అప్పట్లో ఎదురైన అంతర్జాతీయ భద్రతా ముప్పులు ఏమిటి? నాటో సమావేశం వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఏమిటి? అనే విషయాలపై లోతైన చర్చ లేదు. కథనం కేవలం "ఆ రోజు భద్రతా సిబ్బంది ప్రెస్‌ను ఎలా బురిడీ కొట్టించారు?" అనే కోణానికే పరిమితమైంది.

అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? అత్యవసర సమయాల్లో వైట్‌హౌస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ‘ది డికాయ్ ప్లేన్’ ఒక బెస్ట్ షార్ట్ వాచ్. భారీ యాక్షన్ లేదా లోతైన రాజకీయ విశ్లేషణను ఆశించకుండా ఒక రియల్ మిస్టరీ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంటరీని నిరభ్యంతరంగా చూసేయవచ్చు.