Begin typing your search above and press return to search.

లేటెస్ట్ వీడియో వివాదం : నెతన్యాహుది రియల్ వీడియో కాదా.. ఫ్రాన్స్ మైక్రాన్ దా?

వీడియో విడుదలైన కొన్ని నిమిషాలకే నెటిజన్లు అందులోని లోపాలను వెతకడం ప్రారంభించారు.

By:  A.N.Kumar   |   16 March 2026 3:43 PM IST
లేటెస్ట్ వీడియో వివాదం : నెతన్యాహుది రియల్ వీడియో కాదా.. ఫ్రాన్స్ మైక్రాన్ దా?
X

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. యుద్ధ ఉద్రిక్తతల నడుమ, ఆయన ఆరోగ్యం, భద్రతపై వస్తున్న ఊహాగానాలకు తెరదించే క్రమంలో వెలువడిన ఈ వీడియో ఇప్పుడు మరో కొత్త వివాదానికి అనూహ్యమైన చర్చలకు వేదికైంది. నెతన్యాహు స్వయంగా విడుదల చేసిన ఈ వీడియో అసలైనదా లేక ఏఐ సృష్టించిన డీప్‌ఫేక్ గారడీనా? అనే కోణంలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సందర్భం ఏమిటి?

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నెతన్యాహు అదృశ్యమయ్యారని లేదా ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వదంతులు వ్యాపించాయి. అంతకుముందు నెతన్యాహుకు సంబంధించిన ఒక వీడియోలో ఆయన చేతి వేళ్లు అసాధారణంగా ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం.. ఇది ఏఐ వీడియో కావచ్చని నెటిజన్లు ఆరోపించడానికి కారణమైంది. దీనిపై ఆయన స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వైరల్ వీడియోలో ఏముంది?

ఈ వదంతులను తిప్పికొట్టేలా, నెతన్యాహు జెరూసలేం కొండల్లోని “ది సతాఫ్” అనే కేఫ్‌లో కూర్చొని కాఫీ తాగుతున్న వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. “నా మరణంపై వార్తలు వస్తున్నాయని విన్నాను, కానీ ఇక్కడ నేను కాఫీ కోసం వేచి చూస్తున్నాను” అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆరు వేళ్ల వివాదంపై స్పందిస్తూ, తన చేతులను కెమెరా వైపు చూపిస్తూ, వేళ్లను లెక్కించుకోండని చమత్కరించారు. చివరగా కాఫీ కప్పును పైకి ఎత్తి ‘ల’చైమ్’ (జీవితానికి శుభాకాంక్షలు) అని పేర్కొన్నారు.

అనుమానాలు ఎందుకు?

వీడియో విడుదలైన కొన్ని నిమిషాలకే నెటిజన్లు అందులోని లోపాలను వెతకడం ప్రారంభించారు. వీడియోలో కాఫీ కప్పులోని ద్రవం కదలడం సహజంగా లేదని.. నేపథ్యంలోని వ్యక్తుల కదలికలు కృత్రిమంగా ఉన్నాయని కొందరు వాదించారు. ముఖ్యంగా ఎలన్ మస్క్‌కు చెందిన 'గ్రోక్ ఏఐ' ఈ వీడియోపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇది డీప్‌ఫేక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొనడం చర్చను మరింత వేడి పుట్టించింది. గతంలో ఇదే కేఫ్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యాన్స్ ప్రధాని తాగిన వీడియోను షేర్ చేస్తూ మైక్రాన్ కు నెతన్యాహూను యాడ్ చేసి ఏఐతో దీన్ని రూపొందించారని పలువురు నెటిజన్లు షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. నెతన్యాహు బతికిలేరా? నిజంగానే ఆయనకు ఏమైంది అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని ఒక సాధారణ కేఫ్‌లో ప్రశాంతంగా కాఫీ తాగడం భద్రతా కారణాల దృష్ట్యా సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

అధికారిక వివరణ.. వాస్తవ పరిస్థితులు

ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం గట్టిగా ఖండించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని.. ఆయన కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా సంబంధిత “ది సతాఫ్” కేఫ్ యాజమాన్యం కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో నెతన్యాహు తమ వద్ద కాఫీ తాగుతున్న ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా వీడియో చిత్రీకరణ జరిగిన విషయాన్ని ధృవీకరించింది. దీనితో ఇది డీప్‌ఫేక్ కాదనే వాదనకు బలం చేకూరింది.

ఒక చిన్న వీడియో క్లిప్ డిజిటల్ యుగంలో ఎంతటి అలజడిని సృష్టిస్తుందో చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. సాంకేతికత పెరిగిన కొద్దీ నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోవడం కష్టతరంగా మారుతోంది. యుద్ధ సమయంలో సమాచార యుద్ధం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వీడియోల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వర్గాలు, విశ్వసనీయ వార్తా సంస్థల సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో నెతన్యాహు ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక అనుమానాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి.