నెతన్యాహు ప్రసంగానికి రెడీ కాగానే ఐక్యరాజ్యసమితి ఖాళీ అయిపోయింది.. వైరల్ వీడియో
ప్రస్తుతం ఈ వాకౌట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ వీడియో వెనుక దౌత్యపరమైన, రాజకీయపరమైన ఆంతర్యం చాలా పెద్దది.
By: A.N.Kumar | 25 Sept 2026 7:08 PM ISTన్యూయార్క్ వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్.జీఏ) సమావేశాల్లో ఒక ఆసక్తికర దృశ్యం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగించేందుకు పోడియం వైపు అడుగులు వేయగానే.. సభలోని పలు దేశాల ప్రతినిధులు ఒకేసారి తమ సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. నిమిషాల వ్యవధిలోనే హాల్‌లోని చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ప్రస్తుతం ఈ వాకౌట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ వీడియో వెనుక దౌత్యపరమైన, రాజకీయపరమైన ఆంతర్యం చాలా పెద్దది.
ప్రసంగం ముందే మొదలైన 'రాజకీయ నిరసన'
సాధారణంగా అంతర్జాతీయ వేదికలపై ఏ దేశ నాయకుడు మాట్లాడినా ఇతర దేశాల ప్రతినిధులు శ్రద్ధగా వినడం ఐక్యరాజ్యసమితి సాంప్రదాయం. కానీ నెతన్యాహు విషయంలో ఆ ప్రోటోకాల్ పక్కనబెట్టి పలు ప్రతినిధి బృందాలు సభను బహిష్కరించాయి. యూఎన్ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ వాకౌట్ అనుకోకుండా జరిగింది కాదు.. నెతన్యాహు ప్రసంగానికి నిరసనగా ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్య.
గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యలు.. అక్కడ చోటుచేసుకుంటున్న మానవతా సంక్షోభం, వేల సంఖ్యలో పౌరుల మరణాలు.. మౌలిక వసతుల ధ్వంసంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పలు దేశాలు తమ నిరసనను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను ఎంచుకున్నాయి.
ఖాళీ కుర్చీలు.. ప్రపంచానికి పంపిన స్పష్టమైన సందేశం
రాజ్యసభ లేదా అంతర్జాతీయ వేదికలపై వాకౌట్ చేయడం అనేది దౌత్యపరంగా అత్యంత తీవ్రమైన నిరసన సంకేతం. ప్రసంగం ప్రారంభం కాకముందే సీట్లు ఖాళీ కావడం ద్వారా గాజా యుద్ధంపై తమకున్న నిరసనను సదరు దేశాలు స్పష్టంగా వ్యక్తం చేశాయి. అయితే ఈ ఒక్క దృశ్యం ప్రాతిపదికగా ప్రపంచమంతా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉందనే ముగింపునకు రావడం సరికాదు. గాజా సంక్షోభం, ఇజ్రాయెల్ భద్రతా హక్కులు, హమాస్ దాడులు, పాలస్తీనా ప్రత్యేక దేశ హోదా వంటి సంక్లిష్టమైన అంశాలపై ప్రపంచ దేశాలు వేర్వేరు ధోరణులతో విభజించబడి ఉన్నాయి.
తగ్గేదే లేదన్న నెతన్యాహు
సభలో నిరసనలు, వాకౌట్‌లు జరిగినా నెతన్యాహు తన ప్రసంగాన్ని ఏమాత్రం ఆపలేదు. ఇజ్రాయెల్ భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాద గ్రూపుల నుంచి ఎదురవుతున్న ముప్పును తుడిచిపెట్టడానికే తమ సైనిక చర్యలని సమర్థించుకున్నారు. ఈ యుద్ధం హమాస్ ముష్కరులపైనే తప్ప సామాన్యులపై కాదని పేర్కొన్నారు. మరోవైపు పౌరుల ప్రాణనష్టాన్ని నివారించాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలను విడుదల చేసి రెండు దేశాల పరిష్కారం వైపు అడుగులు వేయాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది.
చూడాల్సిన కోణమిదీ..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని సెకన్ల వీడియో క్లిప్‌లు కేవలం ఒక దృశ్యాన్ని మాత్రమే చూపుతాయి. కానీ ఆ ఖాళీ కుర్చీల వెనుక అంతర్జాతీయ దౌత్య విభేదాల తీవ్రత దాగి ఉంది. గాజా యుద్ధం, ఇరాన్ పై యుద్ధంతో అంతర్జాతీయ సమాజం ఏ స్థాయిలో చీలిపోయిందో ఈ యూఎన్ ప్రదర్శన స్పష్టం చేసింది. ఒకవైపు తన ఉనికి, భద్రత కోసం పోరాడుతున్నామని ఇజ్రాయెల్ చెప్తుంటే.. మరోవైపు మానవతా దృక్పథంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రెండు భిన్నమైన వాదనల నడుమ నెతన్యాహు యూఎన్ ప్రసంగం, దానికి దారితీసిన వాకౌట్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి.
