Begin typing your search above and press return to search.

క్షమాభిక్ష కోరిన ఇజ్రాయెల్ ప్రధాని.. అసలేం జరిగింది..!

అవును... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్ కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు.

By:  Raja Ch   |   1 Dec 2025 6:00 AM IST
క్షమాభిక్ష కోరిన ఇజ్రాయెల్ ప్రధాని.. అసలేం జరిగింది..!
X

ఇజ్రాయెల్ కు ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పని చేసిన బెంజమిన్ నెతన్యాహు.. తాజాగా తన ఖాతాలో మరో రికార్డ్ నమోదు చేసుకున్నారు. అయితే అది అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులకు సంబంధించినది కావడం గమనార్హం. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగానూ ఆయన నిలిచారు. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్ కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. దీనిని అసాధారణ అభ్యర్థనగా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

వాస్తవానికి నెతన్యాహు మూడు వేర్వేరు కేసుల్లో మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ కేసులోనూ దోషిగా తేలలేదు. మరోవైపు మొదటినుంచీ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఈ నేపథంలోనే.. దేశాని తీవ్రంగా విభజించిన దీర్ఘకాలంగా కొనసాగుతున్న విచారణను ముగించడానికి.. అవినీతి ఆరోపణల నుంచి తనకు క్షమాపణ ఇవ్వాలని ఆదివారం ఆ దేశ అధ్యక్షుడిని ప్రధాని నెతన్యాహు కోరారు. అయితే.. ఇది వెంటనే అతని ప్రత్యర్థుల నుంచి ఖండనలకు దారి తీసింది. ఇది ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తుందని అంటున్నారు.

నెతన్యాహు కోసం ప్రెసిడెంట్ కు ట్రంప్ లేఖ!:

మరోవైపు.. బెంజమిన్ నెతన్యాహు కోసం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్రంప్.. అవినీతి కేసును రాజకీయ, అన్యాయమైన ప్రాసిక్యూషన్ అని పిలిచారు. దేశాన్ని తీవ్రంగా విభజించిన అవినీతి విచారణలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా... గత మూడు సంవత్సరాల భయంకరమైన క్లిష్ట సమయాలను దాటుతూ.. గొప్ప ఇజ్రాయెల్ దేశం, అద్భుతమైన యూదు ప్రజలు ముందుకు సాగుతున్నప్పుడు.. యుద్ధ సమయంలో బలీయమైన, నిర్ణయాత్మక ప్రధానమంత్రిగా ఉండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ను శాంతి కాలంలోకి నడిపిస్తున్న బెంజమిన్ నెతన్యాహును పూర్తిగా క్షమించమని నేను మిమల్ని కోరుతున్నాను అని ట్రంప్ లేఖలో రాశారు.