ఇజ్రాయెల్లో హంగ్.. అరబ్ పార్టీలకు దూరంగా నెతన్యాహు కొత్త ఎత్తుగడ!
ఇజ్రాయెల్ పార్లమెంట్లోని మొత్తం 120 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.
By: A.N.Kumar | 29 Oct 2026 6:44 PM ISTఇజ్రాయెల్ లో మెజార్టీ యూదులు.. వీరి పొడగిట్టని అరబ్బులతో యుద్ధాలు చేసి నిలబడ్డ వీరులు.. దేశంలో మెజార్టీ వారిదే.. కానీ సరిహద్దుల్లో, పాలస్తీనా ప్రాంతంలో కొంతమంది అరబ్బులు ఉంటారు. ఆ చోట్లే వారే గెలిచారు. ఇజ్రాయెల్ లో ఈసారి ఎవరికీ మెజార్టీ రాకుండా హంగ్ ప్రభుత్వం ఏర్పడడంతో ‘అరబ్బులు’ గెలిచిన సీట్లు కీలకమయ్యాయి. అరబ్బులతో పోరాడుతూ వారి మద్దతు తీసుకోవడం అస్సలు ఇష్టం లేని ఇజ్రాయెల్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ దేశంలో జరగని విధంగా కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఇజ్రాయెల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాలకు వేదికగా మారాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల అనంతరం ఏ ఒక్క కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికారంలో కొనసాగేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై తీవ్రంగా దృష్టి సారించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇజ్రాయెల్ పార్లమెంట్లోని మొత్తం 120 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో నెతన్యాహు కూటమికి గానీ.. ప్రతిపక్ష శిబిరానికి గానీ అవసరమైన మెజారిటీ దక్కలేదు. ఈ హంగ్ పరిస్థితిని అధిగమించేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్కోట్తో కలిసి ‘నేషనల్ యూనిటీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహు ఆలోచిస్తున్నట్లు 'ది జెరూసలెం పోస్ట్' కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ప్రత్యామ్నాయ ఒప్పందంలో ప్రధానంగా రెండు అవకాశాలపై చర్చ నడుస్తోంది. మొదటిది నిర్ణీత కాలానికి ప్రధానమంత్రి పదవిని నెతన్యాహు, ఐసెన్కోట్ పంచుకునేలా అధికార మార్పిడి ఒప్పందం చేసుకోవడం. రెండోది ఐసెన్కోట్కు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సీనియర్ మంత్రి పదవిని కేటాయించి ఆయన వర్గం మద్దతుతో ప్రభుత్వాన్ని నడపడం. భద్రతా వ్యవహారాలపై విశేష అనుభవం ఉన్న ఐసెన్కోట్ మద్దతు లభిస్తే పాలనలో స్థిరత్వం వస్తుందని కొందరు భావిస్తున్నారు.
అయితే ఈ ప్లాన్-బి ఆచరణలోకి రావడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెతన్యాహు కూటమిలోని అతివాద రైట్ వింగ్ మిత్రపక్షాలు.. ముఖ్యంగా ఇటమార్ బెన్గ్విర్ వంటి నేతలు.. ప్రతిపక్షంతో చేతులు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గతంలో నెతన్యాహు నేతృత్వంలో పనిచేసేందుకు ఐసెన్కోట్ నిరాకరించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదనకు ఆయన అంగీకరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
రాష్ట్రపతి ఐజాక్ హెర్జోగ్ చేపట్టబోయే సంప్రదింపులు.. వివిధ పార్టీల మధ్య జరిగే తుది చర్చల ఆధారంగా నెతన్యాహు ప్లాన్-బి కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది తేలనుంది. ఒకవేళ ఈ జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటైతే అది ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఒక కీలక మార్పుగా నిలుస్తుంది. లేని పక్షంలో నెతన్యాహు మరో ప్రత్యామ్నాయాన్ని అన్వేషించక తప్పదు.
అరబ్బు పార్టీలు, సీట్లతో కలవమని నెతన్యాహు, ప్రతిపక్ష నేత ఐసెన్కోట్ కలవమని.. అది ఇజ్రాయెల్ సిద్ధాంతాలకే వ్యతిరేకం అని అంటున్నారు. మరి వీరిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇజ్రాయెల్ లో ఏం జరుగనుందనేది ఉత్కంఠ రేపుతోంది.
