ట్రంప్‌తో వ్యవహారం.. మోదీకి నెతన్యాహు కీలక సూచనలు
ఇజ్రాయెల్, భారత్, అమెరికాల మధ్య నెలకొన్న ప్రత్యేక సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
By: A.N.Kumar | 8 Aug 2025 8:41 PM ISTఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాల వల్ల భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సంబంధాల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇజ్రాయెల్, భారత్, అమెరికాల మధ్య నెలకొన్న ప్రత్యేక సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
- నెతన్యాహు ఏమన్నారంటే...
ఇటీవల భారత జర్నలిస్టులతో మాట్లాడుతూ నెతన్యాహు పలు కీలక విషయాలు వెల్లడించారు. నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇద్దరికీ సన్నిహితుడనని పేర్కొన్నారు. ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై మోదీకి వ్యక్తిగతంగా, రహస్యంగా కొన్ని ముఖ్యమైన సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, సుంకాల అంశంలో వారిద్దరూ అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరిష్కారం కేవలం భారత్, అమెరికాలకు మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలో తాను భారత్‌లో పర్యటిస్తానని నెతన్యాహు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది.
- ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో నిఘా సమాచారాన్ని పంచుకోవడంలో ఇజ్రాయెల్ ముందుంటుందని తెలిపారు. ఇటీవల భారత రాయబారి జేపీ సింగ్‌తో జరిగిన సమావేశంలో కూడా ఇరు దేశాల మధ్య సహకారం, భద్రతా వ్యవహారాలపై చర్చించారు.
- భవిష్యత్ పరిణామాలు
నెతన్యాహు వ్యాఖ్యలు, పర్యటన ప్రకటన భారత్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య త్రైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలకు చేర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ కఠినమైన టారిఫ్‌లను ఎదుర్కొవడంలో ఇజ్రాయెల్, భారత్‌కు ఒక కీలకమైన స్నేహపూర్వక మద్దతుగా నిలుస్తుందా లేదా అనే అంశంపై భవిష్యత్తులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
